నెలకు సంపాదన రూ.9 లక్షలు.. అయినా రూ.70లక్షలు అప్పులు: సలహాలు కోరిన అమ్మాయి!

నెలకు సంపాదన రూ.9 లక్షలు.. అయినా రూ.70లక్షలు అప్పులు: సలహాలు కోరిన అమ్మాయి!

వ్యాపారం సూపర్‌గా నడుస్తోంది. నెలకు దాదాపు 9 లక్షల రూపాయల టర్నోవర్ జరుగుతోంది. పైగా 15 ఏళ్లుగా బిజినెస్ లో అనుభవం ఉంది. అంతా బాగుంది కదా అనుకుంటే పొరపాటే. బయటకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఆ సెలూన్ నడిపిస్తున్న ఫ్యామిలీ వెనుక రూ.70 లక్షల భారీ అప్పుల కొండ పేరుకుపోయింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఒక 21 ఏళ్ల అమ్మాయి తన ఫ్యామిలీ ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సంక్షోభాన్ని రెడ్డిట్ వేదికపై పంచుకోవడంతో ఈ స్టోరీ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.

సదరు యువతి తండ్రి లాయర్ అయినప్పటికీ కేసులు తగ్గడంతో పూర్తి సమయాన్ని సెలూన్ బిజినెస్ పైనే వెచ్చిస్తున్నారు. నెలకు రూ.8లక్షల 94వేల టర్నోవర్ వస్తున్నా.. చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు సరే కదా, అప్పులు రోజురోజుకూ కొండలా పేరుకుపోతున్నాయట. దీనికి కారణం వారికున్న భారీ ఖర్చులే. నెలకు షాప్ రెంట్ రూ.లక్షా 30వేలు, ఇంటి అద్దె రూ.40వేలు, స్టాఫ్ జీతాలు రూ.3లక్షల 50వేలు, సెలూన్ ప్రొడక్ట్స్ ఖర్చు రూ.లక్ష, ఇల్లు గడవడానికి మరో రూ.50వేలు ఖర్చవుతున్నాయని చెప్పింది. వీటన్నిటితో పాటు క్రెడిట్ కార్డులు, లోన్ల ఈఎంఐలకోసమే నెలకు మరో రూ.లక్షా 15 వేలు కట్టాల్సి వస్తోందని చెప్పింది. మొత్తం మీద నెలకు రూ.7లక్షల 85వేలు ఖర్చులు పోను పేపర్ మీద లాభం కనిపిస్తున్నా.. పేరుకుపోయిన పాత అప్పులు, వాటి వడ్డీల వల్ల ఆ ఫ్యామిలీ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది.

ఈ అప్పుల ఊబి నుంచి ఎలాగైనా తన తల్లిదండ్రులను కాపాడుకోవాలని, మార్కెటింగ్ ఫైనాన్స్ పరంగా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమేనని ఆ అమ్మాయి రెడ్డిట్ యూజర్ల సలహాలను కోరింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఆ కుటుంబానికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇచ్చారు. సెలూన్ కోసం వాడే ప్రొడక్ట్స్ ఖర్చు రూ. లక్ష ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించే మార్గాలను చూడాలని ఒకరు సూచించారు. అలాగే రూ.40వేల అద్దె ఇంటిని వదిలేసి చిన్న ఇంట్లోకి మారాలని, ఇంటి ఖర్చులను రూ.50వేల నుంచి రూ.30వేలకు తగ్గించుకుంటే నెలకు కనీసం 30 నుండి 40 వేల రూపాయలు ఆదా అవుతాయని నేటిజన్లు సలహాలు ఇచ్చారు. ఆ మొత్తాన్ని నేరుగా అప్పులు తీర్చడానికి వాడాలని సూచించారు.

చివరగా ఆ అమ్మాయి చదువు పూర్తి కాగానే ఏదైనా సేఫ్ కార్పొరేట్ ఉద్యోగంలో చేరితే కుటుంబానికి అదనపు ఆదాయం వస్తుందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో రిస్క్ ఉన్న పనులు చేయకుండా, ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌ని కలిసి లోన్లను రీస్ట్రక్చర్ చేసుకోవడం బెస్ట్ అని నెటిజన్లు తేల్చి చెప్పారు. ఖర్చులు తగ్గించుకుని, క్రమశిక్షణతో అడుగులు వేస్తేనే ఈ రూ.70 లక్షల అప్పుల చక్రవ్యూహం నుంచి బయటపడటం సాధ్యమవుతుందని నెటిజన్లు తమకు తోచిన సూచనలు చేశారు సెలూన్ ఫ్యామిలీకి.