హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో మధ్యాహ్నం ఎండలు నిప్పులు కురిపిస్తుంటే రాత్రి సమయంలో మాత్రం వర్షం కుండపోతగా కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం వరకూ ఎండ ఠారెత్తించింది. శనివారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమైంది. రాత్రి 7 గంటల తర్వాత వర్షం మొదలైంది. 7.30 సమయానికి భారీ వర్షంగా మారింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, నానక్ రామ్ గూడలో వాన కుండపోతగా కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి.
వాహనదారులు భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జాం కావడంతో నడి వానలో నరకం చూశారు. వీకెండ్ కావడంతో సరదగా సినిమాలకు, షికార్లకు వెళ్లిన వాళ్లంతా వర్షంలో చిక్కుకుపోయారు. కార్లలో ఉన్న వాళ్లు కాస్త సేఫ్ గానీ బైక్స్పై బయటకు వెళ్లిన వాహనదారులు తడిసి ముద్దయిన పరిస్థితి ఉంది.
ఐటీ కారిడార్ ఏరియాలో వాహనదారుల ట్రాఫిక్ తిప్పలు వర్ణనాతీతం. మన హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు బెంగళూరు సిటీలో కూడా శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బెంగళూరు వైట్‌ఫీల్డ్ ప్రాంతం భారీ వర్షానికి జలమయమైంది. శనివారం సాయంత్రం సుమారు 60 మి.మీ. వర్షపాతం నమోదైంది.
