టికెట్ లేకుండా రైలు ఎక్కితే బాదుడే: జరిమానా భారీగా పెంచిన రైల్వే శాఖ..!

టికెట్ లేకుండా రైలు ఎక్కితే బాదుడే: జరిమానా భారీగా పెంచిన రైల్వే శాఖ..!

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారికి విధించే జరిమానాను రూ.500కు పెంచింది. అనధికారిక, టిక్కెట్ లేని ప్రయాణాలను అరికట్టడం, రైల్వే కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. జన్ విశ్వాస్ చట్టం కింద 2026, జూన్ 20 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు తెలిపింది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రస్తుతం రైల్వే శాఖ రూ.250 జరిమానా విధిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జరిమానాను డబుల్ చేసింది రైల్వే శాఖ. 

టికెట్ లేకుండా ప్రయాణించే వారికి విధించే జరిమానాను డబుల్ చేసిన విషయాన్ని శనివారం (జూన్ 20) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రైల్వే శాఖ వెల్లడించింది.  జన్ విశ్వాస్, రైల్వే చట్టం 1989లోని సెక్షన్లు 137, 138 కింద విధించే కనీస జరిమానాను 2026, జూన్ 20 నుంచి రూ.500కి పెంచినట్లు ప్రకటించింది. జరిమానాలను నివారించడానికి ప్రయాణికులు చెల్లుబాటు అయ్యే టిక్కెట్టుతో ప్రయాణించాలని సూచించింది. 

రైల్వే నియమాలను పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. కాగా, 2026 మే నెలలో సెంట్రల్ రైల్వే జోన్ 4.96 లక్షల టిక్కెట్టు లేని ప్రయాణికుల నుంచి రూ.40.85 కోట్ల జరిమానా వసూలు చేసింది. రోజురోజుకు టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువ అవుతుండటంతో రైల్వే శాఖ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.  ఈ నేపథ్యంలో టికెట్ లేని ప్రయాణాలను అరికట్టేందుకు జరిమానాను భారీగా పెంచింది రైల్వే శాఖ.