Prabhas: నాకు పాటలు పాడటం రాదా? నన్ను ఎందుకు 'సింగ్‌ గీతం'లో పెట్టుకోలేదు?.. నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించిన ప్రభాస్!

Prabhas: నాకు పాటలు పాడటం రాదా?  నన్ను ఎందుకు 'సింగ్‌ గీతం'లో పెట్టుకోలేదు?.. నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించిన ప్రభాస్!

94 ఏళ్ల వయసులో కూడా కుర్ర దర్శకులకు సవాల్ విసిరేలా, సరికొత్త సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన సృష్టించిన విజువల్ వండర్, మ్యూజికల్ ఫాంటసీ డ్రామా 'సింగ్‌ గీతం'. ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాను వీక్షించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, చిత్రం చూసిన మైకంలోంచి బయటకు రాలేకపోయారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ ఒక క్రేజీ ప్రమోషనల్ వీడియో చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

'నన్ను ఎందుకు పెట్టుకోలేదు?'
ఈ వీడియోలో ప్రభాస్ తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో నాగ్ అశ్విన్‌ను సరదాగా ఆటపట్టించారు. నా వాయిస్‌లో ఏదైనా సమస్య ఉందా? నాకు పాటలు పాడటం రాదనుకున్నారా? నేను ప్రయోగాలు చేయలేదా? నన్ను ఎందుకు 'సింగ్‌ గీతం'లో పెట్టుకోలేదు? అని ప్రభాస్ ప్రశ్నించిన తీరు అభిమానులను కడుపుబ్బా నవ్విస్తోంది. అవకాశం వస్తే తాను పాటలు కూడా పాడేవాడినని చమత్కరిస్తూనే, ఇది ప్రపంచంలోనే మొదటి 'మాట పాట' సినిమా. సింగీతం గారు, మీరు, దేవిశ్రీ ప్రసాద్ అందరూ ఎంతో కష్టపడి చేశారు. ఈ విషయాన్ని మీరు ప్రేక్షకులకు గట్టిగా చెప్పాలి అని ప్రశంసించారు. ఈ వీడియోలో ప్రభాస్ సరికొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

 

కథేంటంటే?

తండ్రి ఆస్తి కోసం సొంతూరికి వచ్చిన ఒక యువకుడికి (ఆయాన్) అక్కడ ఎలాంటి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి? ఆ ఆస్తిని కాజేయాలని ఊరిలో కొందరు పన్నే పన్నాగాలు ఏంటి? మరోవైపు ఊరి మొత్తానికి జీవనాధారమైన ఒక పవిత్రమైన వృక్షంలోతన తల్లిని చూసుకునే ఒక అమాయకపు అమ్మాయి (అహల్యా బమ్రూ) వల్ల ఆ గ్రామంలో ఎలాంటి గొప్ప మార్పు వచ్చింది? అనే ఆసక్తికరమైన సూపర్ నేచురల్ ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.

 

రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫాంటసీ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రేవతి, తులసి, షాలిని కొండెపూడి, బెనర్జీ వంటి సీనియర్ నటుల నటన చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగచైతన్య, అడివి శేష్ వంటి స్టార్స్ ఈ చిత్రాన్ని మెచ్చుకోగా, ఇప్పుడు ప్రభాస్ ఇచ్చిన అదిరిపోయే రివ్యూతో 'సింగ్‌ గీతం' క్రేజ్ మరింత హైప్ కి చేరింది. ఒకవైపు ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే, నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో రాబోతున్న విజువల్ వండర్ 'కల్కి 2' షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోందని, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని చిత్ర బృందం స్పష్టం చేసింది.