ప్రపంచ దేశాలకు పిడుగు లాంటి వార్త.. హార్మూజ్ జల సంధి మళ్లీ క్లోజ్..!

ప్రపంచ దేశాలకు పిడుగు లాంటి వార్త.. హార్మూజ్ జల సంధి మళ్లీ క్లోజ్..!

టెహ్రాన్: ప్రపంచదేశాలకు ఇరాన్ పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన్ హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ శనివారం (జూన్ 20) సంచలన ప్రకటన చేసింది. లెబనాన్‎పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, అమెరికా దురాక్రమణ ఇలాగే కొనసాగితే తదుపరి చర్యలకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని హెచ్చరించింది. 

కాగా, నెలలు తరబడి సాగిన ఇరాన్-అమెరికా వార్ 2026, జూన్‎లో శాంతి ఒప్పందం ద్వారా ఆగిపోయిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో 14 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇందులో లెబనాన్‎పై ఇజ్రాయెల్ దాడులు ఆపడం ఒకటి. కానీ ఇజ్రాయెల్ ఈ నిబంధనను ఉల్లంఘించి శనివారం (జూన్ 20) లెబనాన్‎పై మెరుపు దాడులు చేసింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా కనీసం 16 మంది మరణించారు. 

ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులను యుద్ధ విరమణ ఒప్పందాన్ని కనికరం లేకుండా, నిరంతరంగా ఉల్లంఘించడం‎గా ఇరాన్ విమర్శించింది. అమెరికా, ఇజ్రాయెల్ ద్వంద వైఖరికి ఈ ఘటనే నిదర్శనమని మండిపడింది. ఈ దాడులకు నిరసనగా హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే మేం కూడా రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. 

కాగా, ఈ వారం ప్రారంభంలో అమెరికా-ఇరాన్ మధ్య పీస్ డీల్ కుదరడటంతో హార్మూజ్ జలసంధి రీఓపెన్ అయ్యింది. నౌకలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇంతలోనే హార్మూజ్ జలసంధిని మళ్లీ క్లోజ్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచదేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ తీరు మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందానికి ముప్పు తెచ్చింది.