బీజింగ్: చైనాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల బీజింగ్‌లోని ఇండియన్ఎంబసీ ప్రత్యేక 'ఓపెన్ హౌస్' నిర్వహించింది. భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డయాస్పోరా సభ్యులు పలు కీలక అంశాలను లేవనెత్తారు. చైనా సోషల్ మీడియాలో భారతీయుల సంస్కృతి, ఆహారపు అలవాట్లను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయ నిపుణులకు అందే వీసాల సంఖ్య భారీగా తగ్గడం, జీవిత భాగస్వాముల(స్పౌజ్) ఉపాధిపై కఠిన నిబంధనలు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాయబారి దొరైస్వామి స్పందిస్తూ.. ఈ సమస్యలపై చైనా ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిపారు. ఎంబసీ తరఫున వాస్తవ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నామన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల కోసం న్యాయ నిపుణులతో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
