బీహార్లో మళ్లీ మొదలైన జెన్ జీ ఉద్యమం : వాటర్ కెనాన్లతో విరుచుకుపడిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?

బీహార్లో మళ్లీ మొదలైన జెన్ జీ ఉద్యమం : వాటర్ కెనాన్లతో విరుచుకుపడిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?

నీట్ పేపర్ లీక్ పై భారత రాజకీయాలకు కొత్త దశ-దిశను చూపిన జెన్ జీ ఉద్యమం..  
ఇప్పుడు బీహార్ లో మళ్లీ మొదలైంది. వేలాది నిరసనకారులు మంగళవారం (ఆగస్టు 04) పాట్నాలో ఆందోళనలకు దిగారు. విద్యార్థులు, యువకుల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ కెనాన్ లు ప్రయోగించారు. 

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపే) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల్లో అరెస్టైన విద్యార్థులను విడుదల చేయడంలో ప్రభుత్వం మాట తప్పిందన్న ఆగ్రహంతో మరోసారి నిరసనలకు దిగారు.  విద్యార్థులపై కేసులు కొట్టివేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పటికీ విడుదల చేయకపోవడంపై ఆగ్రహంతో వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు. 

ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సీఎం సామ్రాట్ చౌదరి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనకడుగు వేయలేదు. కొందరు ఆందోళన కారులు వాటర్ ప్రెజర్ కు గాయపడతామన్న భయం కూడా లేకుండా డ్యా్న్సులు చేయడం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది.

సీఎం ఇంటిముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు.. మొదట గాంధీ మైదాన్ లో సమావేశం అయ్యారు. NSUI, AISF, DYFI తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన మళ్లీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్టును తలపించింది. 

భారీగా తరలి వచ్చిన ఆందోళనకారులను ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి సీఎం నివాసం రెండు కిలోమీటర్లు ఉండటం గమనార్హం. కస్టడీలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేసి వారిపై కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 

నీట్ లీకేజీకి నిరసనగా ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల సందర్భంగా.. బీహార్ లో దాదాపు 600 మందిని అరెస్టు చేశారు పోలీసులు. అందులో కొందరిని మైనర్లుగా గుర్తించి విడుదల చేయగా.. మిగతా వారు ఇంకా పోలీసు కస్టడీలోనే ఉన్నారు. కొందరిని జైలుకు పంపించారు. కేసులు విత్ డ్రా చేసుకుంటామని చెప్పి.. విద్యార్థులను వేధిస్తున్నారంటూ జెన్ జీ మరోసారి ఉద్యమ బాట పట్టారు.