సెంగిపట్టి పోలీస్ స్టేషన్ నుంచి ఉదయనిధి స్టాలిన్ విడుదల.. డీఎంకే కార్యకర్తల సంబరాలు

సెంగిపట్టి పోలీస్ స్టేషన్ నుంచి ఉదయనిధి స్టాలిన్ విడుదల.. డీఎంకే కార్యకర్తల సంబరాలు

డీఎంకే నేత ఉధయనిధి స్టాలిన్ విడుదలయ్యారు. విచారణ అనంతరం ఆయనను విడుదల చేశారు  సెంగిపట్టి స్టేషన్ పోలీసులు. ఉదయనిధి అరెస్టుతో స్టేషన్ దగ్గరకు చేరుకున్న కార్యకర్తలు.. ఆయనకు ఘనస్వాగతం పలికారు.  బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సెంగిపట్టి స్టేషన్ నుంచి ర్యాలీగా బయల్దేరారు ఉదయనిధి. 

కావేరీ నదీ జలాల హక్కులపై ఆందోళన సందర్భంగా నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో.. ఆగస్టు 4న ఉదయం అరెస్టు చేసిన పోలీసులు.. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో బెయిల్ పై విడుదల చేశారు. 

త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్ తో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీవీకే నేతలు తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. మహిళను అవమానించడమే కాకుండా వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

తంజావూరు పోలీసులు విచారణ కోసం 21 కిమీ దూరంలో ఉన్న సెంగిపట్టి స్టేషన్ కు తరలించారు.  అయితే దీనిపై డీఎంకే మద్రాస్ కోర్టును ఆశ్రయించగా.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సింది కోర్టు ఆదేశించింది. విచారణ తర్వాత విడుదల చేస్తామని పోలీసులు చెప్పడంతో.. విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఉదయనిధికి సూచించింది. 

ఆ తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత ఆయనను సెంగిపట్టి స్టేషన్ నుంచి బెయిల్ పై విడుదల చేశారు పోలీసులు. విడుదల తర్వాత భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన ర్యాలీగా బయల్దేరారు. 

కావేరీ జలాలపై రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కాపాడటంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే విఫలమైందని.. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికే ఉదయనిధిని అరెస్టు చేసి హైడ్రామా క్రియేట్ చేస్తున్నారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఉదయనిధి అరెస్టును ప్రభుత్వం సమర్ధించుకుంది. మహిళలను అవమానించడం పద్ధతి కాదు. టీవీకేకు భారీ ఎత్తున మహిళలు ఓట్లు వేశారు. అది జీర్ణించుకోలేకే మహిళలపై కామెంట్స్ చేస్తున్నారు.. ఆయన తమిళనాడుకు సీఎం అయ్యే అర్హత ఉన్న నాయకుడు.. ఇలాంటి ప్రవర్తన సరికాదని రెవెన్యూ మంత్రి కేఏ సెంగోట్టయాన్ అన్నారు.