న్యూఢిల్లీ: డాలర్ బలపడడంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా భారీగా పతనమయ్యాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో శుక్రవారం రూ. 2,840 తగ్గి రూ. 1,50,600 (అన్ని పన్నులతో కలిపి) కి పడింది.
గురువారం ఇది రూ. 1,53,440 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి ఏకంగా రూ. 8,040 నష్టపోయి, రూ. 2,40,700 వద్దకు చేరి రెండు నెలల కనిష్ట స్థాయిని తాకింది. అమెరికా వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయనే అంచనాల మధ్య డాలర్ ఇండెక్స్ ఏడాది కాలపు గరిష్ట స్థాయికి చేరింది.
దీనివల్ల ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తి అయిన బంగారం కంటే డాలర్ వైపు మొగ్గు చూపారు. మరోవైపు యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడంతో, వడ్డీ రూపంలో ఎలాంటి అదనపు రాబడి ఇవ్వని బంగారంపై ఇన్వెస్టర్లు పెట్టుబడులు తగ్గించారు. దీంతో బంగారం వరుసగా మూడోవారం కూడా నష్టాలను చవిచూసింది. అమెరికా–-ఇరాన్ శాంతి ఒప్పందం కుదరడం కూడా ధరలు తగ్గడానికి కారణం.
