- పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 30 నుంచి 40 శాతం నీటి కోత
- స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తిగా సరఫరా నిలిపివేత
- వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌పై ఎల్నినో ఎఫెక్ట్కనిపిస్తున్నది. దీని ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో జంట నగరాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో వాటర్‌బోర్డు పొదుపు చర్యలు చేపడుతోంది. ప్రధానంగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలకు నీటి సరఫరాను 30 నుంచి 40 శాతం కోత విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, స్మిమ్మిగ్ఫూల్స్కు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేశారు.
సిటీలోని సాధారణ వినియోగదారులకు మాత్రం నీటి సరఫరాలో ఎలాంటి కోతలు విధించడం లేదు. సిటీకి నీటిని సరఫరా చేసే ప్రధాన జలాశయాల్లోనూ నీటి మట్టాలు పడిపోతున్నాయని, వర్షాలు పడకపోతే ఇబ్బందులు తప్పవని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, తాగునీటిని వృథా చేయొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్‌లో 2 వేల చ. కి.మీ.లలో వాటర్‌బోర్డు నీటి సరఫరా చేస్తోంది. ఇటీవల ఔటర్ పరిధిలోని గ్రామాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి 601.కి.మీ. పరిధిలోని ప్రాంతాలన్నీ బోర్డులో విలీనమయ్యాయి.
దీంతో విలీన ప్రాంతాలతో కలిపి రోజుకు దాదాపు 730 ఎంజీడీల డిమాండ్ ఉండగా.. ప్రస్తుతం 540 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు.
హైరైజ్ బిల్డింగులతో సమస్య
సిటీలో ప్రధానంగా వెస్ట్ సిటీలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఐటీ కారిడార్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎస్ఆర్నగర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ ప్రాంతాల్లో హైరైజ్, మల్టీ స్టోర్ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, టౌన్‌షిప్‌లు వంటివి పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కొందరు 2 వేల నుంచి 3 వేల అడుగుల వరకు బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు.
దీంతో చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడడంతో ఆయా ప్రాంతాల వాసులు వాటర్ బోర్డు అందించే ట్యాంకర్లపై ఆధార పడుతున్నారు. గత మే నెలలోనే అత్యధికంగా రోజుకు18 వేల వరకు ట్యాంకర్ల బుకింగ్జరగ్గా.. తాజాగా రోజుకు 20 వేల ట్యాంకర్ల బుకింగ్జరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు ‘కోత’ నిర్ణయం తీసుకున్నారు.
నీటిని వృథా చేస్తే క్రిమినల్ కేసు
ఇప్పటికే సిటీలో పెరుగుతున్న నీటి ఎద్దడిని నివారించడానికి వాటర్ బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాగునీటిని వృథా చేసే వారికి జరిమానా విధించడంతో పాటు, క్రిమినల్చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తాగునీటిని వాహనాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, రోడ్ల పరిశుభ్రతకు ఉపయోగించడాన్ని నిషేధించారు. నీటిని వృథా చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నామని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. ఇంకా అలాగే చేస్తే వారిపై క్రిమినల్కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
రైల్వే, రిఫైనరీల వంటి భారీ పరిశ్రమలు శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు త్వరగా ప్రవేశించి, జలాశయాలు నిండితే తప్ప ఈ గడ్డు పరిస్థితుల నుంచి ఉపశమనం లభించడం కష్టమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ నీటిని అత్యంత పొదుపుగా వాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వాటర్ హార్వెస్టింగ్ చట్టం పకడ్బందీగా అమలు చేస్తం: మంత్రి పొన్నం
హైదరాబాద్ నగరంలో వర్షపునీరు వృథాగా పోతోందని, భవిష్యత్ తరాలకు నీటిని అందించేందుకు గ్రౌండ్ వాటర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇందుకోసం వాటర్ హార్వెస్టింగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మాన్సూన్ప్రిపరేషన్పై శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్ఆఫీసులో రివ్యూ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షపునీరు వృథా కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ తరఫున ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ఆ తర్వాత ప్రత్యేక టీమ్స్‌తో డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. 500 చదరపు గజాల బిల్డప్ కంటే ఎక్కువగా ఉన్న వాటిలో కచ్చితంగా వాటర్ హార్వెస్టింగ్ పిట్లు ఉండేలా చూడాలన్నారు.
అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లో ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. అవగాహన కల్పించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవన నిర్మాణాలు జరిగినప్పుడే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసేలా సూచించాలన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల భాగస్వామ్యం ఉండాలని అన్నారు.
పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా వాటర్ సోర్స్ కావాలని తెలిపారు. తమ ప్రభుత్వ హాయంలోనే నగరానికి కృష్ణ ఫేజ్- 1,2, గోదావరి ఫేజ్- 1,2 ద్వారా నీళ్లు వచ్చాయని, ఆ తర్వాత కొత్తగా ఎవరూ నీటిని తీసుకు రాలేదని, ఇప్పుడు మళ్లీ తమ ప్రభుత్వంలోనే అదనంగా తాగునీరు తీసుకొస్తున్నామని చెప్పారు.
ముందుచూపు లేకపోతే కష్టమే..
జంట నగరాల్లో ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. రాబోయే రోజుల్లో ఏర్పడే పరిస్థితిని ఎదుర్కొనేందు కు ముందు చూపుతో సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూగర్భ జలాలు పెంచుకోవడానికి కృషి చేయాలి. ప్రతి ఇంట్లో వర్షపు నీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ముందు చూపులేక పోతే మాత్రం భవిష్యత్‌లో నీటి కరువు తీవ్రంగా ఉంటుంది.
- కె.అశోక్‌రెడ్డి, ఎండీ, వాటర్ బోర్డు
