భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై కేంద్రం సానుకూలం : ఎంపీ వద్దిరాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై కేంద్రం సానుకూలం : ఎంపీ వద్దిరాజు
  • జిల్లా అభివృద్ధిపై చేసిన సూచనలను కేంద్రం గుర్తించింది: ఎంపీ వద్దిరాజు 
  • పార్లమెంట్‌‌లో చేసిన సూచనలకు సానుకూలంగా స్పందిస్తూ లేఖ రాసిందని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధిపై ఇటీవల జరిగిన పార్లమెంట్‌‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద.. ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు లేఖ రాశారు. పార్లమెంట్ జీరో అవర్‌‌‌‌లో ఆయన వద్దిరాజు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిమ్స్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, రైల్వే డివిజన్ ఏర్పాట్ల ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. 

అదేవిధంగా వీటి ఏర్పాటుకు సంబంధించి సమగ్రమైన సమాచారంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పౌర విమానయాన, రైల్వే శాఖల మంత్రులకు వినతిపత్రాలు కూడా అందజేశారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ఆయా మంత్రిత్వ శాఖలు సానుకూలత వ్యక్తం చేస్తూ ఎంపీకి ప్రత్యుత్తరం పంపాయి. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పారిశ్రామిక, ఇంధన, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఎంపీ సూచనలు, సలహాలను తాము గుర్తించామని ఆయా మంత్రిత్వ శాఖలు లేఖలు రాసినట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘దేశ ఇంధన అవసరాలకు సరిపడే బొగ్గును సింగరేణి సంస్థ సమకూర్చుతున్నదని, దీనికి కొత్తగూడెం ప్రధాన కేంద్రం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన సీతారామచంద్ర స్వామి భద్రాచలం క్షేత్రంలోనే కొలువై ఉన్నారు. దక్షిణ గంగా అని పిలుచుకునే గోదావరి నది కూడా ఈ జిల్లా గుండా ప్రవహిస్తున్నది” అని ఎంపీ తన వినతిపత్రంలో ప్రస్తావించారు.