హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక అడుగు వేస్తూ ‘క్యూర్-1 కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్’ అమలుకు గైడ్లైన్స్జారీ చేసింది. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం జీవో 627 విడుదల చేశారు.
క్యూర్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సులు, ఖాళీ భూమి పన్ను, కరెంట్, వాటర్ బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు అన్నీ ఒకే డిజిటల్ వేదికలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్ని చెల్లింపులు మీ సేవ పేమెంట్ గేట్‌వే ద్వారా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.
పథకం అమలు కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏఅండ్‌యూడీ) అధ్యక్షతన ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 90 రోజుల్లో విడివిడిగా ఉన్న చెల్లింపు వ్యవస్థలను క్యూర్-1 వేదికతో అనుసంధానం చేసి, ఏకీకృత చెల్లింపు విధానానికి మారాలని ప్రభుత్వం ఆదేశించింది.
