సోమవారం కోర్టుకు రండి : అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు

సోమవారం కోర్టుకు రండి : అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు

హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య ధియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం.. అంటే 2026, జూన్ 22వ తేదీన కోర్టులో విచారణకు స్వయంగా హాజరుకావాలని అల్లు అర్జున్ కు సమన్లు జారీ చేసింది కోర్టు. 

పుష్ప 2 మూవీ విడుదలను పురస్కరించుకుని.. సంధ్య ధియేటర్ దగ్గరకు వచ్చారు అల్లు అర్జున్. ఆ సమయంలో హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ధియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స తర్వాత ఇటీవలే ఆ చిన్నారి ఇంటికి చేరాడు. సంధ్య ధియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. వీళ్లందరికీ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 

ఈ కేసులో A11 గా ఉన్నారు అల్లు అర్జున్. A1 నుంచి A 10 వరకు ఉన్న నిందితులు అందరూ సంధ్య ధియేటర్ యాజమాన్యం, ఇతర సిబ్బంది ఉన్నారు. నిందితులు అందరూ జూన్ 22వ తేదీ సోమవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు తర్వాత ట్రయల్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 23 మంది నిందితులుగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు.

2024 డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 మూవీ   రిలీజ్ సందర్భంగా సంధ్య ధియేటర్ లో బెనిఫిట్ షో వేశారు. బెనిఫిట్ షో చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ధియేటర్ దగ్గరకు వచ్చారు. ఆ ధియేటర్ లోనే ఫస్ట్ షో చూసేందుకు అల్లు అర్జున్ ధియేటర్ దగ్గరకు వచ్చారు. హీరోను చూసేందుకు అభిమానులు తోసుకురావటం.. ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. అతని కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ కేసులోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఓ రాత్రి అంతా చంచల్ గూడ జైలులో ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.