ఒకరు ప్రాణాలు కాపాడే డాక్టర్.. మరొకరు ఆ ఇంటినే నమ్ముకుని 15 ఏళ్లుగా పనిచేస్తున్న నమ్మకమైన పనిమనిషి. పైగా, ఆ డాక్టర్ తల్లి క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు ఒక కూతురిలా దగ్గరుండి చూసుకున్న చేతులు ఆమెవి. కానీ, మానసిక వికారానికి లోనైన ఆ వైద్యుడి క్రూరత్వానికి, ఆ నమ్మకమే రక్తాభిషేకమైంది. ఢిల్లీలోని సంపన్న ప్రాంతమైన మౌంట్ కైలాష్‌లో జరిగిన ఈ ఘోరం, మానసిక జబ్బులు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో చెప్పడానికి ఒక భయానక ఉదాహరణగా నిలిచింది.
ఆ నిమిషంలో ఏం జరిగింది
గురువారం ఉదయం 10:30 గంటలు. 45 ఏళ్ల మీనా ఎప్పటిలాగే డాక్టర్ మనీష్ గుప్తా (50) ఇంట్లోకి అడుగుపెట్టింది. రోజులాగే బట్టలు ఉతికి, వాటిని ఆరవేయడానికి బంగ్లా టెర్రస్‌పైకి వెళ్లింది. అంతలోనే, గత కొన్నేళ్లుగా డిప్రెషన్, అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మనీష్ గుప్తా అక్కడ ఉన్నాడు. మీనాను పనిలోంచి తీసేయాలనే విషయంలో భార్యతో జరిగిన గొడవ అతని తలలో విషాన్ని నింపింది.
తన కొడుకు క్రికెట్ బ్యాట్‌తో మీనా తలపై, ముఖంపై పదేపదే బాదాడు. ఆపై అంతటితో ఆగక, వంటగది కత్తితో ఆమె గొంతు కోశాడు. రక్తపు మడుగులో మీనా ప్రాణాలు కోల్పోయింది.
'నన్ను ఉరితీయండి'.. మెట్లపై....
రక్తపు మరకలతో ఉన్న కత్తి, బ్యాట్‌ను పక్కన పడేసి.. డాక్టర్ గుప్తా బిల్డింగ్ మెట్లపై నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు. ఎదురుగా ఉన్న టవర్ నుంచి చూసిన ఒక నివాసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ఆ డాక్టర్ నోట వచ్చిన మాట ఒక్కటే.. “నన్ను ఉరితీయండి” అని. నేరం జరిగిన సమయంలో అతని 19 ఏళ్ల కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. దాడి తర్వాత కిందకు వచ్చిన తండ్రి, తాను మీనాపై దాడి చేశానని చెప్పడంతో ఆ కుర్రాడు నిర్ఘాంతపోయాడు.
అమ్మ ఎప్పుడూ 'డాక్టర్ సార్' గురించి
నెహ్రూ ప్లేస్‌లో ఉద్యోగం చేస్తున్న మీనా కొడుకు రాబిన్ కన్నీరుమున్నీరవుతు.. “ఉదయం 6:30 గంటలకే నేను ఎప్పటిలాగే పనికి వెళ్లాను. ఆ తర్వాత మా బంధువు ఫోన్ చేసి అమ్మ ఇక లేదన్నాడు. అమ్మ ఎప్పుడూ 'డాక్టర్ సార్' గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వారి మధ్య గొడవలే లేవు. ఎవరైనా ఇంత దారుణం ఎందుకు చేస్తారు ?” అంటూ రోదించడం అక్కడి వారిని కదిలించింది. మీనా సోదరి షప్తమి మాట్లాడుతూ.. “మా అందరిలో మీనా చాలా సున్నితస్థురాలు. అసలు ఏం జరిగిందో మాకు సమాధానం దొరికే వరకు మేము ఊరుకోము” అని ఆవేదన వ్యక్తం చేసింది.
విచారణలో మరికొన్ని నిజాలు..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితుడు మనీష్ గుప్తా తీవ్రమైన హింసాత్మక ఆలోచనలతో ఉన్నాడని, తన భార్యను, కొడుకును చంపాలా లేక ఆత్మహత్య చేసుకోవాలా అని సతమతమవుతున్నాడని తెలిసింది. మీనాను పనిలోంచి తీసేయాలని అతను పట్టుబడితే.. ఆమె చేసిన సేవలను గుర్తించి ఇంట్లోనే ఉంచుకోవాలని అతని భార్య వాదించింది. ఈ గొడవే మీనా పాలిట శాపమైంది. ప్రస్తుతం డాక్టర్ గుప్తా తన మానసిక మందులు వాడటం ఆపేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడిని తీసుకెళ్తున్న పోలీస్ వాహనాలను మీనా బంధువులు అడ్డుకోవడంతో ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత, విషాద వాతావరణం నెలకొంది. ఓ వైపు మానసిక జబ్బు, మరోవైపు అమాయకురాలైన మహిళ ప్రాణం.. ఈ ఘటన ఢిల్లీని దిగ్భ్రాంతికి గురిచేసింది.
