యాక్సెంచర్ రిపోర్టుతో మన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత.. లేఆఫ్స్ భారీగా ఉండనున్నాయా..?

యాక్సెంచర్ రిపోర్టుతో మన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత.. లేఆఫ్స్ భారీగా ఉండనున్నాయా..?

ఏఐ టెక్నాలజీ ప్రతి నిమిషం ఒక విస్పోటనం మాదిరిగా అభివృద్ధి చెందుతూపోతోంది. అది ఎంత వేగంగా జరుగుతోందంటే రానున్న 20 ఏళ్లలో జరగాల్సిన టెక్ గ్రోత్ కొన్ని నెలల్లోనే సాధిస్తోంది. ఈ పరిస్థితుల్లో రోజుకొక కంపెనీ తమ ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్నాయి. అయితే టెక్కీలకు ఇప్పుడు ఏఐకి మించిన తలనొప్పి ఒకటి వెంటాడుతోంది. లేఆఫ్స్ ఏఐ వల్ల ప్రధానంగా జరగనప్పటికీ దాని అభివృద్ధి, దాని పనితీరు, దాని వైఫల్యం కూడా టెక్కీలకు నిద్రలేకుండా చేస్తోంది. 

తాజాగా టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఏఐ అభివృద్ధి వేగం కంటే దాని వాస్తవ వినియోగం రేటు చాలా నెమ్మదిగా కొనసాగుతోందని తన రిపోర్టులో పేర్కొంది. దీంతో కంపెనీలకు రెండు రకాలుగా నష్టం జరుగుతోంది. ఒకటి ఫ్యూచర్ టెక్నాలజీ కోసం భారీగా నిధులు కేటాయించాల్సి రావటం అయితే మరొకటి దానిని అమ్ముకుని సొమ్ము చేసుకుందాం అంటే క్లయింట్స్ అంతే వేగంగా స్పందించకపోవటం. టెక్నాలజీ ఎంత మారినా దానిని కొనుగోలు చేసేందుకు, రోజువారీ వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చాలా కంపెనీలు బడ్జెట్స్ పెంచటం లేదని ఐటీ కంపెనీలు వాపోతున్నాయి. 

ఈ పరిస్థితులు లక్షల మంది భారతీయ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారాంతంలో వచ్చిన షాకింగ్ రిపోర్ట్ తమ కెరీర్ ని మింగేయబోతోందనే వాస్తవం అని టెక్కీలకు అర్థం అయ్యింది. ఇప్పటి వరకూ ఏఐ ఇన్ ఫ్రా ఖర్చుల కోసం టెక్కీలను జాబ్స్ నుంచి తొలగించేసిన టెక్నాలజీ కంపెనీలు ఇకపై దానిని అమ్ముకోవటంలో వచ్చే ఇబ్బందులతో తగ్గిన ఆదాయాలు, లాభాలను మ్యాచ్ చేసేందుకు ఐటీ ఉద్యోగులను భారీగా లేఆఫ్స్ చేయాల్సి ఉంటుందని నిపుణులు కుండబద్ధలు కొట్టి చెబుతున్నారు. 

ALSO READ : యాక్సెంచర్ ఏం చెప్పింది..?

టాటా గ్రూప్ ఇటీవలి ఫలితాలను చూస్తే.. మెుత్తం సంస్థకు వస్తున్న ఆదాయంలో దాదాపు 40 శాతానికి పైగా కేవలం తన టెక్ సర్వీసెస్ బిజినెస్ టీసీఎస్ నుంచే సమకూరుతోంది. సో భవిష్యత్తులో ప్రాజెక్టుల నుంచి ఆదాయం తగ్గనుందనే వాస్తవం వాటి ఆర్థిక ఫలితాలను తారుమారు చేయనుందని టాప్ మేనేజ్మెంట్ కంగారుపడుతోంది. ఈ ఏడాది గత ఏడాదితో పోల్చితే ఆదాయాలు తగ్గటమే ఇటీవల చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ శాలరీ హైక్ రిజెక్ట్ చేయటానికి కారణం అని తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో రానున్న కాలంలో సాంప్రదాయ భారతీయ టెక్నాలజీ సేవల కంపెనీలు ఏఐ వాడకంలోనూ దూసుకెళ్లినప్పటికీ అది ఆర్థికంగా ఫలితాలను ఇవ్వటానికి చాలా ఏళ్లు పట్టనుందని తేలిపోయింది. ఆదాయాలు లేకుండా ఉద్యోగులకు లక్షల్లో జీతాలు చెల్లిస్తూ కంపెనీలు భారాన్ని మోయలేవు కాబట్టి, ఈ మధ్యలో ఎంత మంది టెక్కీలను మన ఐటీ కంపెనీలు తొలగించబోతున్నాయ్ అన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.