యాక్సెంచర్ ఏం చెప్పింది..? ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక ఏం చెబుతోంది..?

యాక్సెంచర్ ఏం చెప్పింది..? ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక ఏం చెబుతోంది..?

గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ భవిష్యత్తు ఆదాయ అంచనాలను తగ్గించుకోవడం భారతీయ ఐటీ మార్కెట్‌ను అతలాకుతలం చేసింది. దీంతో శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే మన ఐటీ స్టాక్స్ కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.2 లక్షల కోట్లు ఆవిరైపోయింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజాల షేర్లు 6% వరకు నష్టపోయాయి. నిఫ్టీలో భారీగా నష్టపోయిన టాప్ 15 కంపెనీలూ ఐటీ రంగానికి చెందినవే కావడం ఇన్వెస్టర్లకు పిచ్చెక్కిస్తోంది.

యాక్సెంచర్ ఏం చెప్పింది?
యాక్సెంచర్ 3వ త్రైమాసిక ఆదాయం 6% వృద్ధి చెంది దాదాపు రూ.లక్షా 56వేల కోట్లకు చేరినప్పటికీ.. భవిష్యత్తు వ్యాపారంపై కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ఇన్వెస్టర్లను భయపెట్టింది. కంపెనీ తన పూర్తి స్థాయి వార్షిక ఆదాయ వృద్ధి అంచనాను గతంలో చెప్పిన 3-5% నుంచి 3-4 శాతానికి తగ్గించుకుంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే తమ వ్యాపారానికి రూ.3వేల 330 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. అన్నిటికంటే ముఖ్యంగాAIపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి ఉన్నప్పటికీ.. క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లను పెంచడం లేదని యాక్సెంచర్ బయటపెట్టింది. కొత్తగా ఖర్చు పెట్టకుండా, పాత బడ్జెట్‌ను మాత్రమే ఏఐ ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారని చెప్పింది.

భారతీయ ఐటీ కంపెనీలపై ప్రభావం..
భారతీయ సాఫ్ట్‌వేర్ రంగానికి వెన్నెముక లాంటి 'అవుట్‌సోర్సింగ్ బుకింగ్స్' యాక్సెంచర్‌లో 15 శాతం పడిపోవడం దలాల్ స్ట్రీట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయ కంపెనీలు కొత్తగా పెద్ద ఒప్పందాలు చేసుకోవడానికి వెనుకాడుతున్నాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. ఈ మందగమనం వల్ల భారతీయ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ఇకపై సాంప్రదాయ ప్రాజెక్టులపైనే కాకుండా.. చిన్న తరహా ఏఐ ప్రాజెక్టులపై వేగంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే రాబోయే త్రైమాసికాల్లో లాభాలు ఆర్జించటం కష్టమేనని యాక్సెంచర్ రిపోర్ట్ హెచ్చరించింది.

అంతర్జాతీయ మార్కెట్లలో వణుకు..
ఈ ఐటీ సెగ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. అమెరికా మార్కెట్లో యాక్సెంచర్ షేరు 18% పతనమవగా.. భారతీయ టెక్ కంపెనీల అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్(ADRs) కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఇన్ఫోసిస్ ఏడీఆర్ 10%, విప్రో ఏడీఆర్ 7% పైగా నష్టపోయాయి. వీటితో పాటు కాగ్నిజెంట్ 10%, ఐబీఎమ్ 5%, ఫ్రాన్స్‌కు చెందిన క్యాప్‌జెమిని 9% మేర క్షీణించాయి. గ్లోబల్ టెక్ రంగంలో ఖర్చులు ఎంత ఒత్తిడిలో ఉన్నాయో ఇది నిరూపిస్తోంది.

బ్రోకరేజ్ సంస్థల హెచ్చరిక..
ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. జెఫెరీస్ సంస్థ ఐటీ రంగానికి 'అండర్‌వెయిట్' రేటింగ్‌ను కొనసాగిస్తూ.. భారతీయ ఐటీ కంపెనీల సంపాదన అంచనాల్లో మరిన్ని కోతలు ఉండవచ్చని హెచ్చరించింది. హెచ్‌ఎస్‌బీసీ, నోమురా లాంటి గ్లోబల్ సంస్థలు కూడా ఐటీ డిమాండ్ బలహీనంగా ఉందని, భౌగోళిక అస్థిరత వల్ల టెక్ కంపెనీల వాల్యుయేషన్లపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నాయి.

యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ ఏఐ వ్యాపారంలో గ్లోత్ ఉందని.. తాము కొత్త కొనుగోళ్ల కోసం దాదాపు రూ.85వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పినప్పటికీ.. ఇన్వెస్టర్ల సహనం నశిస్తోంది. ఏఐ వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్న మాట నిజమే అయినా.. కంపెనీల ఆదాయాలు వెంటనే పెరిగే సూచనలు కనిపించకపోవడమే ప్రస్తుత ఐటీ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.