దేశంలో పసిడి ప్రేమికులకు, బులియన్ మార్కెట్‌కు గట్టి షాక్ తగిలింది. భారతదేశంలోకి వచ్చే బంగారానికి కేంద్ర ప్రభుత్వం గట్టిగా బ్రేకులు వేసింది. గతంలో నెలకు ఏకంగా 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల వరకు ఉన్న గోల్డ్ ఇంపోర్ట్స్.. ఇప్పుడు ఏకంగా 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అంటే దిగుమతులు దాదాపు మూడో వంతు తగ్గిపోయాయన్నమాట. బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతానికి పెంచడమే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ సీనియర్ వర్గాలు చెబుతున్నాయి.
బ్యాంకులకు నోటిఫికేషన్ కట్..
ఇంతటితో ఆగకుండా.. కేంద్ర కస్టమ్స్ శాఖ ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి బంగారం దిగుమతి చేసుకునే అధికారిక సంస్థల జాబితాలో బ్యాంకులను చేర్చుతూ ఎలాంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయలేదు. దీనివల్ల దేశంలోకి విదేశీ బంగారం తెచ్చే పవర్ఫుల్ రైట్స్ ప్రస్తుతం కేవలం MMTCతో పాటు మరో రెండు ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే పరిమితం అయ్యింది. బ్యాంకులు రంగం నుంచి తాత్కాలికంగా అవుట్ అవ్వడంతో అఫీషియల్ ఛానల్స్ ద్వారా బంగారం రాక బాగా తగ్గిపోయింది.
పాత బంగారం రీసైక్లింగ్‌కు పెరిగిన డిమాండ్
విదేశాల నుంచి కొత్త బంగారం రావడం తగ్గడంతో, డొమెస్టిక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. మార్కెట్లో రేట్లు భారీగా పెరగడం, కొత్త స్టాక్ లేకపోవడంతో జనాలు తమ ఇళ్లల్లో ఉన్న పాత నగలను మార్చుకోవడం పెంచేశారు. ప్రభుత్వ పాలసీ తాము అనుకున్నట్టే పనిచేస్తోందని.. విదేశీ కరెన్సీ వృథా కాకుండా ఇంపోర్ట్స్ తగ్గాయి.. అదే సమయంలో పాత బంగారం రీసైక్లింగ్ మార్కెట్ ఊపందుకుందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. కామర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం ఏప్రిల్‌లో 5.63 బిలియన్ డాలర్లుగా ఉన్న గోల్డ్ ఇంపోర్ట్స్.. మే నాటికి 3.42 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
ALSO READ : రూ.304కోట్ల ప్రాపర్టీని రూ.12వందల 60 కోట్లకు అమ్మిన ZEE టీవీ ఓనర్..
బులియన్ వ్యాపారుల గుండెల్లో గుబులు..
కేంద్ర ప్రభుత్వ కఠిన నిర్ణయంతో బంగారం దిగుమతులు పడిపోవటంపై బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంపోర్ట్ డ్యూటీ 15 శాతానికి పెరగడం, బ్యాంకులకు అనుమతులు నిలిచిపోవడంతో మార్కెట్లో స్టాక్ లభ్యత దారుణంగా పడిపోయిందని అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ కస్టమర్లు భారీగా కొనుగోళ్లు చేయడానికి వెనుకాడుతున్నారు. లీగల్ ఛానల్స్ ద్వారా బంగారం రావడం కష్టమైతే.. స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే బ్యాంకులకు దిగుమతి అనుమతులు ఇచ్చి.. డ్యూటీ తగ్గించకపోతే జ్యువెలరీ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో పడుతుందని చిన్న వ్యాపారులు వాపోతున్నారు.
