ఆర్మూర్-మంచిర్యాల హైవేకు ఫారెస్ట్ క్లియరెన్స్ !

ఆర్మూర్-మంచిర్యాల హైవేకు ఫారెస్ట్ క్లియరెన్స్ !
  • ఎన్‌‌హెచ్-63 పరిధిలో 131 కిలోమీటర్ల మేర 4 లేన్ల హైవే నిర్మాణానికి మోక్షం
  • మూడు జిల్లాల్లోని 16.1864 హెక్టార్ల అటవీ భూమి బదిలీకి అనుమతులు

హైదరాబాద్, వెలుగు: ఉత్తర తెలంగాణ రవాణా రంగానికి అత్యంత కీలకమైన ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల నేషనల్ హైవే (ఎన్​హెచ్-63) విస్తరణ పనులకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈ హైవేను 4- లేన్ల రహదారిగా నిర్మించేందుకు అటవీ భూముల వినియోగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుది అనుమతులు ఇస్తూ సర్కార్ జీవో విడుదల చేసింది.

హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) కింద ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్-63లోని ఆర్మూర్ (డిజైన్ కిమీ 29+100) నుంచి మంచిర్యాల (డిజైన్ కిమీ 160+995) వరకు మొత్తం 131 కిలోమీటర్ల మేర 4  లేన్ల రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 16.1864 హెక్టార్ల అటవీ భూమిని డైవర్షన్ చేసేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. దీని కోసం మూడు జిల్లాల అటవీ భూమిని సేకరిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో 5.4262 హెక్టార్లు, జగిత్యాలలో 3.9067 హెక్టార్లు, మంచిర్యాల జిల్లాలో 6.8535 హెక్టార్లు అటవీ భూమి డైవర్షన్ చేశారు. అటవీ భూమి వినియోగానికి పరిహారంగా యూజర్ ఏజెన్సీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ) ప్రభుత్వం నిర్దేశించిన ఖాతాల్లో మొత్తం రూ.10.78 కోట్లు డిపాజిట్ చేసింది. ప్రత్యామ్నాయ అటవీ పెంపకం కోసం రూ.3.64 కోట్లు, నెట్ ప్రజెంట్ వ్యాల్యూ కోసం రూ.1.74 కోట్లు, వన్యప్రాణుల సంరక్షణ ప్రణాళిక కోసం రూ.3.25 కోట్లు, నేల, తేమ పరిరక్షణకు రూ.60.25 లక్షలు  కేటాయించనున్నారు. 

మిషన్ భగీరథ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పనులకు క్లియరెన్స్..
గజ్వేల్ కొమటిబండ గుట్టలోని మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ పరిధిలో మిగిలిపోయిన ఇన్ టేక్ స్ట్రక్చర్, వాటర్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాంట్, పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ల నిర్మాణానికి సంబంధించి 0.9764 హెక్టార్ల అటవీ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

దీంతో గజ్వేల్, మేడ్చల్, జనగామ, ఆలేరు – భువనగిరి సెగ్మెంట్ పరిధిలోని ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేసేందుకు మార్గం సుగమమైంది. అటవీ సంరక్షణ చట్టం (1980) ప్రకారం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి తుది అనుమతులు రావడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.