నిజామాబాద్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి (20) హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. అదనపు కట్నం కోసం ఆమెను వేధించి హత్య చేసిన వైష్ణవి భర్త హరిబాబును చంపేశారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న వైష్ణవి భర్త హరిబాబు నిజామాబాద్లోని ఆర్ఆర్ చౌరస్తాలో దారుణ హత్యకు గురయ్యాడు.
బెయిల్పై బయట ఉన్న హరిబాబును గుర్తు తెలియని దుండగుడు కారులో వచ్చి కత్తులతో పొడిచి చంపేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నడిరోడ్డుపై పట్టపగలే హరిబాబును హత్య చేయడం కలకలం రేపింది. కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో పొడిచి చంపేసినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.
వైష్ణవి అప్పట్లో యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. హరిబాబుతో పది నెలల పరిచయం ప్రేమగా మారింది. 2025 మే 29న వెంకటాపూర్ శివారులోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు. మొదట రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ, మరో రూ.5 లక్షలు తేవాలని హరిబాబు తరచూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులకు అతని తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్ సహకరించారు.
నాలుగు నెలల గర్భిణిగా ఉన్నా వైష్ణవిపై కూడా వేధింపులు కొనసాగాయి. ఈ క్రమంలోనే.. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో గదిలో గొడవ జరిగి, హరిబాబు కత్తితో దాడి చేశాడు. ఉదయం అతడు పరారవ్వగా, గదిలో రక్తపు మడుగులో ఉన్న వైష్ణవిని చూసిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.
అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పరారీలో ఉన్న హరిబాబును కోనరావుపేట ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
