హైదరాబాద్: తెలంగాణలో 7 వేల 437 పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల తేదీలను TSLPRB (తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్) ఖరారు చేసింది. SI అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించాలని TSLPRB నిర్ణయించింది.
పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), అగ్నిమాపక, విపత్తుల స్పందన, అత్యవసర సేవలు, సివిల్ డిఫెన్స్, జైళ్లు –కరెక్షనల్ సర్వీసెస్ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో మొత్తం 7,437 పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి.
పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శాఖల్లోని కానిస్టేబుల్ తదితర సమానమైన పోస్టుల (డ్రైవర్ పోస్టులు మినహా) ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచిన సంగతి తెలిసిందే.
గతంలో జీవో 122 ద్వారా యూనిఫామ్ సర్వీసుల గరిష్ట వయోపరిమితిని 7 ఏళ్లు పెంచగా, హోం శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్ (32 ఏళ్లు), కానిస్టేబుల్ (29 ఏళ్లు) పోస్టుల మధ్య ఉన్న 3 ఏళ్ల తేడాను గమనించిన ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రయోజనార్థం పరిశీలించి కానిస్టేబుల్ పోస్టులకు ఈ అదనపు సడలింపును ప్రకటించింది.
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 3 ఏళ్ల అదనపు వయో సడలింపుతో కలిపి, జీవో 87, జీవో 122 ద్వారా ఇదివరకే ఇచ్చిన 7 ఏళ్ల సడలింపుతో మొత్తం 10 ఏళ్ల సడలింపు కానిస్టేబుల్ అభ్యర్థులకు లభించనుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా చేపట్టే రాబోయే నియామకాలకు ఈ నూతన వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలంగా పోలీస్ ఉద్యోగాల కోసం కఠిన సాధన చేస్తూ వయోపరిమితి ముగిసిపోతుందనే ఆందోళనలో ఉన్న వేలాది మంది అభ్యర్థులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కిన సంగతి తెలిసిందే.
- తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి
- ఎస్‌ఐ, కానిస్టేబుల్ సహా మొత్తం 7,437 పోస్టులు
- 4.29 లక్షల మంది అభ్యర్థుల నుంచి 5.77 లక్షల దరఖాస్తులు
- ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నవంబర్ 29న
- కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష డిసెంబర్ 20న
- ఎస్‌ఐ పోస్టులకు 1,60,756 దరఖాస్తులు
- కానిస్టేబుల్ పోస్టులకు 3,89,356 దరఖాస్తులు
- 97.4 శాతం మంది అభ్యర్థుల ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి
- ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేయని వారికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం
- పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో తొలిసారిగా ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్
- దరఖాస్తుల్లో 56.84 శాతం మంది తెలుగు మీడియం ఎంచుకున్నారు
