తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా్ల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
సోమవారం నుంచి రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలో పలు చోట్ల పిడుగుల తోకూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
గత కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటిక అంచనాలకు తగ్గట్టుగా వర్షాలు పడలేదు. చాలా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానలకోసం రైతులు ఎదురు చూస్తున్నారు. చాలాచోట్ల కప్పతల్లి ఆటలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలో ఎల్నినో ప్రభావంతో నెల రోజలు వర్షాలు లేట్ అయినప్పటికీ తిరిగి రుతుపవనాలు పుంజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి.
గత నాలుగురోజులుగా పలు జిల్లాలో వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోమాత్రమే వర్షం పడటంతో రైతులు వానలకోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ వారికి గుడ్ న్యూస్ అందింది. దాదాపు రాష్ట్రంలో 70 శాతం జిల్లాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇదిలా ఉండగా..ఆదివారం(ఆగస్టు2) సాయంత్రం హైదరాబాద్ సిటీలో పొద్దు్న్నుంచి వేడిగా, ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. సిటిలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,ఫిలింనగర్, మాదాపూర్, పంజాగుట్ట, బోయిన్ పల్లి, ఈసీఐఎల్, కాచిగూడ, మలక్ పేట, ఉప్పల్, మణికొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వానలు పడుతుండటంతో వేడి, ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించిందని ఊరట చెందుతున్నాయి. వానలు పడుతుంటే ప్రజలు ఆనందపడుతున్నారు.
