- పిల్లలను తల్లితో మాట్లాడించకపోవడంపై ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: పిల్లలను తల్లితో మాట్లాడించాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించని ఎన్‌ఆర్‌ఐ తండ్రిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలతో సహా ఆగస్టు 12న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. వీడియో కాల్ ద్వారా పిల్లలతో తల్లి మాట్లాడేలా గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు చేయలేదని పేర్కొంది. 20 నెలలుగా పిల్లలను చూడలేకపోతున్న తల్లికి వారిని చూపించడమే కోర్టు ఉద్దేశమని స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన బి.షాలినికి 2015లో భరత్‌కుమార్‌తో వివాహం జరిగింది.
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. పిల్లలను కలవనివ్వడం లేదంటూ షాలిని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మార్చి 25న పిల్లలను వీడియో కాల్‌లో తల్లితో మాట్లాడించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదని షాలిని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ కేసును జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిల్లలు తల్లితో మాట్లాడే సమయంలో తండ్రి పక్కనే ఉండటం, పిల్లలను చివరి నిమిషంలో మాత్రమే కెమెరా ముందు తీసుకురావడం వంటి అంశాలను కోర్టు కమిషన్ నివేదికలో గుర్తించింది.
పిల్లలపై ఎక్కువ నియంత్రణ పెట్టడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. తల్లిదండ్రుల్లో ఒకరి ప్రభావంతో పిల్లలు మరొకరికి దూరమయ్యే పరిస్థితిని ‘పేరంటల్ అలియనేషన్ సిండ్రోమ్’ అంటారని, ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని కోర్టు తెలిపింది. కేసు విచారణను తప్పించుకునేందుకు బదిలీ పిటిషన్లు, ఇతర ప్రయత్నాలు చేయడాన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలతో కలిసి తండ్రి కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆగస్టు 12న పిల్లలతో సహా హాజరుకావాలని భరత్‌కుమార్‌ను ఆదేశించింది
