హైదరాబాద్, వెలుగు: భారత తయారీ రంగంలో కాగిత పరిశ్రమ కీలక స్థానాన్ని ఆక్రమించిందని, ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని కొనసాగించాలంటే కంపెనీలు ఆధునిక ఆవిష్కరణలు, సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి పిలుపునిచ్చారు.
ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్, తెలంగాణ పేపర్ మర్చంట్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో శనివారం జాతీయ కాగిత దినోత్సవ సెమినార్ నిర్వహించాయి.
పర్యావరణహిత ప్యాకేజింగ్, రీసైక్లింగ్ విధానాలపై దృష్టి సారిస్తే ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలు ఇక్కడి ప్యాకేజింగ్ సామర్థ్యాలపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నాయని నిఖిల్ చక్రవర్తి వివరించారు.
