నీట్ కటాఫ్ మార్కులు ఖరారు.. స్టేట్ ర్యాంకులు ప్రకటించిన కాళోజీ హెల్త్ వర్సిటీ

నీట్ కటాఫ్ మార్కులు ఖరారు.. స్టేట్ ర్యాంకులు ప్రకటించిన కాళోజీ హెల్త్ వర్సిటీ
  • మొత్తం 38 వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్ కు అర్హత
  • జనరల్ కేటగిరీకి 715–213.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 212–177 మార్కులు కటాఫ్ 
  • స్టేట్​ టాపర్​గా వీరయ్యగారి సాహ్యూ, రెండో స్థానంలో బుర్రా సాయి శరణ్
  • తర్వలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించిన వర్సిటీ అధికారులు 
  • నీట్ యూజీ ఆల్ ఇండియా.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ రెడీ అయింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ యూజీ అర్హత కటాఫ్ మార్కులను అధికారులు ఖరారు చేశారు. ఈ కటాఫ్ మార్కుల ఆధారంగా రాష్ట్ర విద్యార్థుల ర్యాంకుల లిస్టును వర్సిటీ శనివారం విడుదల చేసింది. అన్‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్ (యూఆర్), ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 50వ పర్సంటైల్‌‌‌‌‌‌‌‌ను కటాఫ్‌‌‌‌‌‌‌‌ గా నిర్ణయించారు. ఈ కేటగిరీ విద్యార్థుల అర్హత స్కోరు 715 నుంచి 213 మార్కులుగా నమోదైంది. 

ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు 40వ పర్సంటైల్ ప్రకారం 212 నుంచి 177 మార్కులను కటాఫ్‌‌‌‌‌‌‌‌ గా ఖరారు చేశారు. దివ్యాంగుల (పీడబ్ల్యూఎస్) కేటగిరీలో యూఆర్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 45వ పర్సంటైల్ (212–194 మార్కులు) కటాఫ్‌‌‌‌‌‌‌‌ గా నిర్ణయించారు. ఓబీసీ, ఎస్సీ దివ్యాంగులకు 40వ పర్సంటైల్ (193–177 మార్కులు) నిర్ణయించారు. ఎస్టీ దివ్యాంగులకు 40వ పర్సంటైల్ (191–177 మార్కులు) కటాఫ్‌‎గా ఖరారు చేశారు.

రాష్ట్రంలో 38,021 మంది అర్హత

ప్రస్తుత లిస్టు ప్రకారం రాష్ట్రం నుంచి మొత్తం 38,021 మంది విద్యార్థులు కౌన్సిలింగ్ కు అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయి అర్హుల లిస్టులో వీరయ్యగారి సాహ్యూ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇతడు 705 మార్కులతో ఆల్ ఇండియా 13వ ర్యాంకు సాధించాడు. బుర్రా సాయి శరణ్ 701 మార్కులతో ఆల్ ఇండియా 19వ ర్యాంకు పొంది ద్వితీయ స్థానంలో నిలిచాడు. 6,7 ర్యాంకుల్లో బాలికలు నిలిచారు. 13వ ర్యాంకు నుంచి 11,94,725 ర్యాంకు వరకు అర్హత సాధించిన విద్యార్థులు రాష్ట్ర పరిధిలోని 85 శాతం కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ కళాశాలల్లోని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కోటా సీట్లకు కూడా వీరు అర్హులవుతారు. 

ఇది ప్రైమరీ లిస్టు మాత్రమే..

ప్రస్తుతం విడుదల చేసిన లిస్టు కేవలం ప్రాథమిక అర్హత వివరాలు మాత్రమేనని వర్సిటీ స్పష్టం చేసింది. ఎన్‌‌‌‌‌‌‌‌టీఏ డేటా ఆధారంగా విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహన కోసం దీనిని విడుదల చేసినట్లు తెలిపింది. దీనిని ఫైనల్ మెరిట్ లిస్టుగా భావించకూడదని వర్సిటీ స్పష్టం చేసింది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వర్సిటీ త్వరలో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

 ఒకటి రెండు రోజుల్లోనే ఆన్‌‌‌‌‌‌‌‌ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. ధ్రువపత్రాల స్క్రూటినీ పూర్తయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తారు. ప్రొవిజనల్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే తెలపడానికి గ్రీవెన్స్ రూపంలో రెండు రోజుల సమయం ఇస్తారు.

15 నుంచి 20 రోజుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ

విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీంచిన తర్వాత వర్సిటీ ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల రిజర్వేషన్లను శాఖల సర్టిఫికెట్ల ఆధారంగా ధ్రువీకరిస్తారు. ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ, క్యాప్, పీడబ్ల్యూడీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్ ప్రత్యేక కేటగిరీల లిస్టును విడిగా ప్రకటిస్తారు. ఫైనల్ మెరిట్ లిస్టు ఆధారంగా కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌‌‌‌‌‌‌‌ లైన్ రిజిస్ట్రేషన్ నుంచి కౌన్సెలింగ్ వరకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని కాళోజీ వర్సిటీ అధికారులు వెల్లడించారు. ప్రవేశాల నోటిఫికేషన్లు, అప్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ ల కోసం వర్సిటీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ knruhs.telangana.gov.in ను పరిశీలించాలని అధికారులు సూచించారు.

నీట్ యూజీ ఆల్ఇండియా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల 

దేశవ్యాప్తంగా 15 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ వర్సిటీలు, ఎయిమ్స్, జిప్మర్‌‌‌‌‌‌‌‌లలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు నీట్ యూజీ 2026 ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను మొత్తం నాలుగు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 5 నుంచి 12 వరకు జరగనుండగా, ఫీజు చెల్లింపునకు ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు అవకాశముంది. 

చాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు 6 నుంచి 13 వరకు ఉండగా, ఆగస్టు 17న ఫలితాలు వెల్లడించి, 18 నుంచి 22 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్‌‌‌‌‌‌‌‌కు గడువిచ్చారు. అనంతరం రెండో విడత రిజిస్ట్రేషన్లు ఆగస్టు 25 నుంచి 29 వరకు, ఆప్షన్ల నమోదు 25 నుంచి 30 వరకు సాగుతాయి. సెప్టెంబర్ 2న ఫలితాలు ప్రకటించి, సెప్టెంబర్ 3 నుంచి 8 వరకు చేరేందుకు అవకాశమిచ్చారు. ఆన్‌‌‌‌‌‌‌‌ లైన్ స్ట్రే వేకెన్సీ మూడో రౌండ్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు, చాయిస్ ఫిల్లింగ్ 11 నుంచి 16 వరకు సాగుతాయి.

 సెప్టెంబర్ 18న ఫలితాలు విడుదల చేసి, 19 నుంచి 26 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌‌‌‌‌‌‌‌ కు సమయమిచ్చారు. మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించి, అక్టోబర్ 3న ఫలితాలు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 4 నుంచి 10 వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు శని, ఆదివారాలు, సెలవు దినాలను సైతం పనిదినాలుగానే పరిగణించాలని ఎంసీసీ స్పష్టం చేసింది.