హైదరాబాద్, వెలుగు: రక్షణ తయారీ రంగంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్‌లో శనివారం రక్షణ ఎంఎస్‌ఎంఈ తయారీదారుల ఫోరమ్ సదస్సును నిర్వహించింది. భారతదేశాన్ని గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ అనే ముఖ్యాంశంతో ఇది కొనసాగింది.
సీనియర్ ప్రభుత్వ అధికారులు, విధానకర్తలు, రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఈ రంగం భవిష్యత్తుపై చర్చించారు. ఆత్మనిర్భర్ భారత్ విధానాల కారణంగా భారత రక్షణ రంగం అపూర్వమైన వృద్ధిని సాధిస్తోందని తెలిపారు.
2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణ వస్తువుల ఉత్పత్తి రూ.1.78 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.38వేల కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. హైదరాబాద్ దేశ రక్షణ రాజధానిగా గుర్తింపు పొందిందని, డిఫెన్స్ ఆర్అండ్ డీ ల్యాబ్స్, మిస్సైల్ తయారీ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయని వివరించారు.
