ఎన్ హెచ్- 163పై యాక్సిడెంట్లకు చెక్!..యాదాద్రి- వరంగల్ రోడ్డును ‘జీరో ఫ్యాటలిటీ కారిడార్’గా తీర్చిదిద్దేందుకు అడుగులు

ఎన్ హెచ్- 163పై యాక్సిడెంట్లకు చెక్!..యాదాద్రి- వరంగల్ రోడ్డును ‘జీరో ఫ్యాటలిటీ కారిడార్’గా తీర్చిదిద్దేందుకు అడుగులు
  • హైవేపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేలా అధికారుల చర్యలు
  • రూ.75 కోట్లతో రోడ్డుకు రిపేర్లు, రూ.5.37 కోట్లతో సేఫ్టీ మెజర్స్
  • అప్రోచ్ రోడ్డు జంక్షన్ల వద్ద సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాటు
  • రోడ్ స్టడ్స్, పెడెస్ట్రియన్స్ గార్డ్ రెయిలింగ్ ఏర్పాటు చేసేలా పనులు

హనుమకొండ, వెలుగు: నేషనల్ హైవే-163పై యాదాద్రి టు వరంగల్ సెక్షన్ ను 'జీరో ఫ్యాటలిటీ కారిడార్'గా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. గ్రామాలు, పట్టణాల తాకుతూ 99 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రోడ్డుపై చాలాచోట్ల సరైన సేఫ్టీ మెజర్స్ లేక తరచూ ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ నేపథ్యంలోనే  యాక్సిడెంట్లు, మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ) అధికారులు చర్యలు చేపడుతున్నారు. దాదాపు రూ.80.37 కోట్లతో వివిధ పనులు చేపట్టి ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పనులు స్టార్ట్ కాగా, తొందర్లోనే వాటిని పూర్తి చేసి, జీరో ఫ్యాటలిటీ కారిడార్ గా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.

రూ.1,905 కోట్లతో 99 కి.మీల ఫోర్ లైన్..

హైదరాబాద్ టు ఛత్తీస్ గఢలోని భూపాలపట్నం వరకున్న ఎన్హెచ్-163లో యాదగిరిగుట్ట-– వరంగల్ సెక్షన్ ను నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (ఎన్ హెచ్డీపీ) ఫేజ్-4 కింద ఫోర్ లైన్ గా విస్తరించారు. 2015లో ఈ పనులకు ఆమోదం లభించగా, 2016లో పనులు చేపట్టారు. పనుల పూర్తి అనంతరం ఈ రోడ్డును 2020లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతులమీదుగా అధికారికంగా ప్రారంభించారు. కాగా, యాదాద్రి నుంచి హనుమకొండ జిల్లా ఆరెపల్లి వరకు దాదాపు 99.10 కిలోమీటర్ల రోడ్డును రూ.1905.23 కోట్లతో డెవలప్ చేశారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 23.4 కిలోమీటర్లు, జనగామ 45.6 కి.మీ, హనుమకొండ జిల్లా పరిధిలోని ఆరెపల్లి వరకు 30.10 కి.మీ వరకు ఫోర్ లైన్ గా విస్తరించారు.

సేఫ్టీ మెజర్స్ లేక ప్రమాదాలు..

ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్-163పై చాలాచోట్ల సేఫ్టీ మెజర్స్​ లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. యాదగిరిగుట్ట నుంచి ఆరెపల్లి వరకు అప్రోచ్ రోడ్ల వద్ద సరైన లైటింగ్ లేక యాదాద్రి, జనగామ జిల్లాలతో పాటు హనుమకొండ జిల్లా పరిధిలోని కరుణాపురం, ఎలుకుర్తి, దేవన్నపేట, చింతగట్టు, వంగపహాడ్ తదితర గ్రామాల జంక్షన్ల వద్ద రాత్రివేళ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల గ్రామాల రోడ్లను సూచించే సైన్‌‌‌‌‌‌‌‌బోర్డులు లేకపోవడం, మరికొన్ని చోట్ల రోడ్లు ఎగుడుదిగుడుగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో ప్రతి ఏడాది ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరిగే దాదాపు 10 ప్రాంతాలను అధికారులు ఇప్పటికే బ్లాక్‌‌‌‌‌‌‌‌స్పాట్లుగా గుర్తించారు.

రూ.80.37 కోట్లతో భద్రతా చర్యలు

దాదాపు 99 కిలోమీటర్ల మేర ఉన్న ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్-163ను 'జీరో ఫ్యాటలిటీ కారిడార్'గా తీర్చిదిద్దేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి, జనగామ, హనుమకొండ జిల్లాల పరిధిలో రూ.5.37 కోట్లతో రోడ్డు సేఫ్టీ మెజర్స్​ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జంక్షన్ల వద్ద సోలార్ లైటింగ్, రోడ్ స్టడ్స్, డెలినేటర్స్, సైన్‌‌‌‌‌‌‌‌బోర్డులు, పాదచారుల కోసం గార్డ్​రైలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దేవన్నపేట, చింతగట్టు, రెడ్డిపురం, వంగపహాడ్ జంక్షన్ల వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే యాదగిరిగుట్ట నుంచి ఆరెపల్లి వరకు రోడ్డు రిపేర్, జర్క్స్ తొలగింపు పనుల కోసం రూ.75 కోట్లతో టెండర్లు పిలవగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

ప్రమాదాలు సంభవించకుండా చర్యలు..

నేషనల్ హైవే-163లో యాదగిరిగుట్ట నుంచి వరంగల్ ఆరెపల్లి వరకు రోడ్డు యాక్సిడెంట్లు, మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే రూ.70 లక్షలతో లైటింగ్ సిస్టంకు రిపేర్లు పూర్తి చేశాం. ఇప్పుడు జంక్షన్ల వద్ద సోలార్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. పనులన్నీ పూర్తి చేసి యాదగిరిగుట్ట-వరంగల్ సెక్షన్ ను జీరో ఫ్యాటలిటీ కారిడార్ గా మార్చేందుకు కృషి చేస్తాం.- భరద్వాజ్, ఎన్హెచ్ఏఐ పీడీ, వరంగల్