తుర్కయంజాల్‌లో రెవెన్యూ అధికారులపై మహిళ వీరంగం.. ఆర్ఐ గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన వైనం

తుర్కయంజాల్‌లో  రెవెన్యూ అధికారులపై మహిళ వీరంగం.. ఆర్ఐ గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన వైనం

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో విధుల్లో ఉన్న రెవెన్యూ అధికారులపై ఓ మహిళ వీరంగం సృష్టించింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులపై దౌర్జన్యానికి దిగడమే కాకుండా.. ఏకంగా ఆర్ఐ కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లింది.

అసలు ఏం జరిగిందంటే.. తుర్కయంజాల్‌లోని సర్వే నంబర్ 338 లో ఉన్న 1810 గజాల భూమిపై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఆదిబట్ల సీఐ విజ్ఞప్తి మేరకు.. ఆ వివాదాస్పద భూమిని ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం.. భూమిని స్వాధీనం చేసుకునేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) ప్రేమ్ కుమార్, జీపీవో హన్మంతు అక్కడికి చేరుకున్నారు.

అయితే అధికారులు అక్కడ ల్యాండ్ స్వాధీనం చేసుకుంటుండగా.. ఓ మహిళ ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చింది. "మీరు అధికారులని గ్యారంటీ ఏంటి?" అంటూ బెదిరింపులకు దిగింది. అధికారులు తమ ఐడీ కార్డులు చూపించినా వినకుండా.. వాటిని లాక్కుని దుర్భాషలాడింది. అంతటితో ఆగకుండా, ఆర్ఐ ప్రేమ్ కుమార్ గల్లా పట్టుకుని పక్కకు ఈడ్చుకెళ్లి తీవ్ర దౌర్జన్యం చేసింది. తాము అధికారులమని, ప్రభుత్వ ఆదేశాల మేరకే వచ్చామని మొత్తుకుంటున్నా ఆ మహిళ వినలేదు.

ప్రభుత్వ అధికారులపైనే ఇలా నడిరోడ్డుపై దాడికి దిగడం తుర్కయంజాల్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై బాధితులు ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించారు. తనను కులం పేరుతో దూషించారంటూ జీపీవో హన్మంతు.. విధులకు ఆటంకం కలిగించి, దాడి చేశారంటూ ఆర్ఐ ప్రేమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.