మ్యాచ్ ముగిసింది.. గొడవ మొదలైంది.. రక్తం వచ్చేటట్లు కొట్టుకున్న కెనడా– ఖతార్ ప్లేయర్స్ 

మ్యాచ్ ముగిసింది.. గొడవ మొదలైంది.. రక్తం వచ్చేటట్లు కొట్టుకున్న కెనడా– ఖతార్ ప్లేయర్స్ 

Canada vs Qatar Football Players Fighting: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) మెగా టోర్నమెంట్లో కో-హోస్ట్‌గా ఉన్న కెనడా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఖతార్‌ను 6–0 తేడాతో ఘోరంగా ఓడించి, తమ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మొట్ట మొదటి ఫిఫా వరల్డ్ కప్ విజయాన్ని నమోదు చేసింది. కానీ, కెనడా చారిత్రాత్మక విజయం సాధించిన ఆనందాన్ని మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఒక పెద్ద గొడవతో ఖరాబ్ చేసుకుంది. ఫైనల్ విజిల్ పడిన వెంటనే ఇరు జట్ల ప్లేయర్స్, స్టాఫ్ మైదానంలోనే ఒకరిపై మరోకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

జోనాథన్ డేవిడ్ హాట్రిక్ గోల్స్: 
ఈ మ్యాచ్ మొదటి నుంచి కెనడా పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. కెనడా స్టార్ ప్లేయర్ జోనాథన్ డేవిడ్ (Jonathan David) అద్భుతమైన ఆటతీరుతో హాట్రిక్ గోల్స్ కొట్టి ఖతార్ డిఫెన్స్‌ను బ్రేక్ చేశాడు. అతనికి తోడుగా సైల్ లారిన్, నాథన్ సాలిబా కూడా గోల్స్ చేయడంతో కెనడా 6–0తో లీడ్ సాధించింది. మ్యాచ్ మధ్యలో ఖతార్ ప్లేయర్లు ఫ్రస్ట్రేషన్‌తో ఓవరాక్షన్ చేయడంతో, ఆ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకి రెఫరీ రెడ్ కార్డ్స్ ఇవ్వడంతో బయటకు వెళ్లారు. దీంతో మ్యాచ్ ముగిసేసరికి ఖతార్ జట్టు కేవలం 9 మందితోనే ఆడాల్సి వచ్చింది.

ఇస్మాయిల్ కోనేకు తీవ్ర గాయం: 
మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెనడా మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కోనే (Ismael Kone) కి ఖతార్ ప్లేయర్ అసిమ్ మదిబో చేసిన ఒక ప్రమాదకరమైన టాకిల్ వల్ల తీవ్ర గాయమైంది. మొదట రెఫరీ దీనికి ఎల్లో కార్డ్ ఇచ్చినప్పటికీ.. VAR (వీడియో అసిస్టెంట్ రెఫరీ) రివ్యూ తర్వాత దానిని రెడ్ కార్డ్‌గా మార్చారు. కోనే గాయపడటంతో కెనడా ప్లేయర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. మ్యాచ్ ముగిసిన వెంటనే టచ్‌లైన్ దగ్గర ఒకరినొకరు దూషించుకుంటూ గొడవకు దిగారు. ఈ ఘటనలో పలువురి ఆటగాళ్లకి, సపోర్ట్ స్టాప్ గాయపడినట్లు తెలుస్తుంది.