ఉద్యోగులకు డబుల్ ధమాకా: పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు.. ఇకపై UPI, ATMల ద్వారా కూడా విత్‌డ్రా!

ఉద్యోగులకు డబుల్ ధమాకా: పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు.. ఇకపై UPI, ATMల ద్వారా కూడా విత్‌డ్రా!

దాదాపు 7.8 కోట్లకు పైగా ఉన్న ఈపీఎఫ్ఓ (EPFO) సబ్  స్క్రయిబర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు జూన్ చివరిలోగా  'EPFO 2.0' అనే కొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకురాబోతోంది. దీని ద్వారా భవిష్యత్తులో ఏటీఎం లేదా యూపీఐ (UPI) ద్వారా కూడా ఈజీగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలోని బోర్డు ప్రతిపాదించిన 8.25% వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల చివరి నాటికి దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ రానుంది.  సమాచారం ప్రకారం.. ఈ జూన్ నెలలోనే ఉద్యోగుల అకౌంట్లో వడ్డీ డబ్బులు జమ కావడం ప్రారంభమవుతుంది. కొత్త డిజిటల్ సిస్టమ్ వల్ల గతంలో కంటే చాలా వేగంగా మీ అకౌంట్లలో వడ్డీ డబ్బులు  చేరుతాయి. ఉద్యోగులకు వరుసగా  మూడో ఏడాది కూడా 8.25% వడ్డీ రావడం విశేషం.

ఏటీఎం, యూపీఐ ద్వారా డబ్బుల విత్‌డ్రా
పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఇకపై మరింత ఈజీ కాబోతోంది. జూన్ చివరిలో ప్రారంభం కానున్న 'EPFO 2.0'లో భాగంగా.. మీ పీఎఫ్ డబ్బుల్లో 75% వరకు నేరుగా ఏటీఎం లేదా యూపీఐ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం 'భీమ్ (BHIM) యాప్' ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఆన్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ పెట్టుకోవడం కష్టంగా భావించే సామాన్యూలకు, ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుంది.

మారిన పీఎఫ్ విత్‌డ్రా రూల్స్
డబ్బులు త్వరగా చేతికి అందేలా చేయడం కోసం EPFO ఇప్పటికే పాత నిబంధనలను మార్చింది. గతంలో ఉన్న 13 రకాల విత్‌డ్రా కేటగిరీలను కేవలం 3 కేటగిరీలకు కుదించింది. వీటిలో....
*అత్యవసర అవసరాలు అంటే అనారోగ్యం కోసం హాస్పిటల్ ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు...
*ఇంటి అవసరాల కోసం అంటే ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం కోసం...
*ప్రత్యేక పరిస్థితులు అంటే ఇతర అత్యవసర సమయాల్లోఉపయోగపడేందుకు..  
దీనివల్ల మీరు పెట్టుకునే పీఎఫ్ క్లెయిమ్‌లు చాలా వేగంగా అప్రూవ్ అవుతాయి.

తగ్గని వడ్డీ రేటు..
నిజానికి పీఎఫ్ వడ్డీ రేటును 8.10% కి తగ్గించాలని ఆర్థిక శాఖ అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ సూచించాయి. ఒకవేళ వడ్డీ రేటును 8.25%గా ఉంచితే బోర్డుకు సుమారు రూ.944.06 కోట్ల లోటు వస్తుందని లెక్కగట్టారు. అయిన.. ప్రభుత్వం  వేతన ఉద్యోగుల ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. లోటు వచ్చినా పర్వాలేదు, లక్షలాది మంది ఉద్యోగుల పదవీ విరమణ జీవితానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో పాత వడ్డీ రేటు (8.25%)నే కొనసాగించాలని నిర్ణయించింది.

మొత్తానికి ఈ జూన్ నెల నుండి వడ్డీ డబ్బులు పడటం, అలాగే యూపీఐ విత్‌డ్రా ఆప్షన్ రానుండటంతో పీఎఫ్ వినియోగదారులకు  డబుల్ బెనిఫిట్ కలగబోతోంది.