దేశం బంగ్లాదేశ్.. రాజస్తాన్లో ఆధార్ కార్డు.. ఆదిలాబాద్లో చోరీలు

దేశం బంగ్లాదేశ్.. రాజస్తాన్లో ఆధార్ కార్డు.. ఆదిలాబాద్లో చోరీలు
  •  ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
  • తొమ్మిదేండ్లుగా దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న ముఠా
  • మావలలో చోరీ కేసులో పట్టుబడ్డ నిందితులు

ఆదిలాబాద్, వెలుగు: బంగ్లాదేశ్​నుంచి అక్రమంగా చొరబడతారు.. రాజస్తాన్​లో తీసుకున్న నకిలీ ఆధార్​ కార్డుతో దేశమంతా తిరుగుతారు.. పగలు రెక్కీ చేసి రాత్రి చోరీలకు పాల్పడతారు.. దొంగ సొత్తుతో తిరిగి తమ దేశానికి వెళ్లిపోతారు.. ఇలా 10, 12 సార్లు అక్రమంగా భారత్​లోకి చొరబడి దొంగతనాలు చేసిన బంగ్లాదేశ్​దొంగల ముఠాను ఆదిలాబాద్​ పోలీసులు పట్టుకున్నారు.

 రెండు రోజుల కింద మావల పరిధిలోని కైలాస్ నగర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో బంగ్లాదేశ్ కు చెందిన మొహమ్మద్ జౌనీ అలీ, మొహమ్మద్ రుమాన్ అలీ, భోపాల్ కు చెందిన తరుణ్ సింగ్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్ కు చెందిన నిందితులు అక్రమంగా దేశంలోకి చొరబడిన జైపూర్ లో ఉంటున్నట్టు ఫేక్ ఆధార్ కార్డు తీసుకున్నారు. 

తొమ్మిదేండ్లుగా రాజస్తాన్, ఒడిశా, కర్నాటక, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో తిరుగుతూ ద్విచక్ర వాహనాలు, ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. జులై 11న బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన అనంతరం తన సహచరులతో కలిసి బైక్ పై మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ చేరుకుని మావల పోలీస్ స్టేషన్ పరిధిలో కైలాష్ నగర్ లో చోరీకి పాల్పడ్డారు.

 నిందితులు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్టు నటిస్తూ కాలనీల్లో సంచరించి రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ చెప్పారు. బంగ్లాకు చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ జౌనీ అలీపై దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎనిమిది కేసులుండగా.. తరుణ్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 6కు పైగా కేసులున్నాయి. 

ఈ ముఠాలోని ఇతర సభ్యులపై కూడా అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. అరెస్టు చేసిన నిందితుల నుంచి 73.05 గ్రాముల బంగారం (ఆదిలాబాద్ కేసుకు సంబంధించిన 50.75 గ్రాములు) నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ కేసుకు సంబంధించిన 22.30 గ్రాములు), 151.30 గ్రాముల వెండి, రూ.4,270 నగదు, 5 ఐఫోన్లు, 2 శాంసంగ్ మొబైల్ ఫోన్లు, ఒక ఆపిల్ ఐప్యాడ్, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. వాటి మొత్తం విలువ రూ. 8 లక్షల వరకు ఉంటుందన్నారు. 

10 నుంచి 12 సార్లు అక్రమంగా భారత్​లోకి..

మొహమ్మద్ జౌనీ అలీ ఇప్పటివరకు 10 నుంచి 12 సార్లు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించి, వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. 2017లో ఒడిశాలో చోరీకి పాల్పడి అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్​, చత్తీస్​గడ్​లోనూ నేరాలకు పాల్పడి పలుమార్లు అరెస్టయి జైలుకు వెల్లాడు. బంగ్లాదేశ్​ నుంచి దాదాపు 12 నుంచి 15 మంది దేశంలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నట్టు విచారణలో తెలిసిందని, వీరు ముఠాలుగా వచ్చి నేరాలకు పాల్పడుతున్నట్టు తేలిందని ఎస్పీ చెప్పారు. 

మిగతా నేరస్తులను కూడా గుర్తించి పట్టుకునేందుకు బలగాలను నియమించినట్టు తెలిపారు. జిల్లా పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ , వివిధ రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో దొంగలను వేగంగా పట్టుకున్నారన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 

మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్, సీసీఎస్ ఇన్​స్పెక్టర్ చంద్రశేఖర్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.