భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ విధానాల్లో కీలక మార్పులు వచ్చాయి. సెబీ తీసుకొచ్చిన కొత్త ట్రేడింగ్ ఫ్రేమ్‌వర్క్ ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చింది. మార్కెట్‌లో ధరల నిర్ణయం మరింత పారదర్శకంగా ఉండేలా, ట్రేడింగ్ సామర్థ్యాన్ని పెంచేలా ఈ మార్పులు చేశారు.
మారిన రూల్స్ ప్రకారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(F&O)లో ఉన్న షేర్లకు ఈక్విటీ క్యాష్ మార్కెట్‌లో సాధారణ ట్రేడింగ్ సమయం మధ్యాహ్నం 3:15 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ విధానం ద్వారా ఆ షేర్లకు మరింత సమర్థవంతంగా ముగింపు ధరను నిర్ణయించనున్నారు.
క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌లో మొదటి దశ ఆర్డర్ ఎంట్రీ సమయం మధ్యాహ్నం 3:20 నుంచి 3:25 వరకు ఉంటుంది. రెండో దశ 3:25 నుంచి 3:30 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చివరి దశలో కొన్ని ఆర్డర్ల మార్పులు లేదా రద్దులకు పరిమితులు ఉంటాయి. అనంతరం 3:30 నుంచి 3:35 వరకు ఆర్డర్ మ్యాచింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియలో నిర్ణయించిన ధరే ఆ షేర్ల అధికారిక క్లోజింగ్ ధరగా పరిగణిస్తారు.
అలాగే ఈక్విటీ డెరివేటివ్స్ (F&O) విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని 10 నిమిషాలు పొడిగించారు. ఇక నుంచి F&O ట్రేడింగ్ మధ్యాహ్నం 3:40 గంటల వరకు కొనసాగుతుంది. అయితే F&Oలో లేని సాధారణ ఈక్విటీ షేర్ల ట్రేడింగ్ సమయం మాత్రం మారలేదు. అవి మునుపటిలాగే మధ్యాహ్నం 3:30 గంటల వరకు ట్రేడ్ అవుతాయి. కేవలం ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలిజిబిలిజీ ఉన్న షేర్ల విషయంలోనే తాజా మార్పుల ప్రభావం ఉండనుంది.
సెబీ ప్రీ-ఓపెన్ సెషన్ సమయాల్లో కూడా మార్పులు చేసింది. కొత్త విధానం ప్రకారం ఉదయం 9:00 నుంచి 9:07 వరకు ఆర్డర్ ఎంట్రీకి అవకాశం ఉంటుంది. 9:07 నుంచి 9:15 వరకు ఆర్డర్ మ్యాచింగ్ జరుగుతుంది. సాధారణ మార్కెట్ ట్రేడింగ్ మాత్రం ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం మార్కెట్‌లో పారదర్శకత పెంచడం, సరైన ముగింపు ధరను నిర్ణయించడం, పెట్టుబడిదారులకు మెరుగైన ట్రేడింగ్ అనుభవాన్ని అందించడం అని సెబీ పేర్కొంది. ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్, పాసివ్ ఫండ్స్ వంటి పెట్టుబడి సాధనాలకు ధరల ఖచ్చితత్వం మెరుగుపడుతుందని సెబీ భావిస్తోంది.
