రీల్స్ చేసి సస్పెండ్ అయిన ఇంగ్లీష్ టీచర్.. సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా

రీల్స్ చేసి సస్పెండ్ అయిన ఇంగ్లీష్ టీచర్.. సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా

ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి సస్పెండ్ అయిన ఖమ్మం జిల్లాకు చెందిన ఇంగ్లీష్ టీచర్ గుర్తున్నారా. ప్రభుత్వ పాఠశాల టీచర్ అయి ఉండీ.. ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్స్ చేసిన ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. లేటెస్టుగా ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఆమె  తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. 

ఖమ్మం లోని మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసిన    గౌతమీ రాథోడ్ (భూక్యా గౌతమి).. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. విద్యాశాఖ ఆమె సస్పెన్షన్ ను ఎత్తేసి విధుల్లో చేరాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

తన సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత రీజాయినింగ్ అవుతున్న క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అవమానించడంతో రాజీనామా చేస్తున్నట్టు వీడియోలో వెల్లడించారు.  సస్పెన్షన్ ముగిసి తిరిగి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ, జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తనను తీవ్రంగా అవమానించి, మానసిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. 

 అధికారుల తీరును, తనపై వస్తున్న నిందలను భరించలేక కన్నీటిపర్యంతమవుతూ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం (3 ఆగస్ట్ 2026) వీడియో ద్వారా ప్రకటించారు.