రూ.27వేలు సంపాదిస్తే చివరికి మిగిలింది రూ.300.. పన్ను పోటుపై మహిళ వీడియో వైరల్

రూ.27వేలు సంపాదిస్తే చివరికి మిగిలింది రూ.300.. పన్ను పోటుపై మహిళ వీడియో వైరల్

ఢిల్లీలో నివసించే ప్రియల్ పాల్ అనే ఉద్యోగిని షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "Story of a Salaried Employee" పేరుతో ఆమె చేసిన వీడియోలో, డివిడెండ్లు, బ్యాంక్ వడ్డీ వంటి మార్గాల ద్వారా ఏడాది పొడవునా రూ.26వేల 600 అదనంగా సంపాదించానని తెలిపింది. అయితే ఆ ఆదాయంపై పన్నులు, వడ్డీ కలిపి దాదాపు రూ.26వేల 300 చెల్లించాల్సి వచ్చిందని చెప్పింది. దీంతో తనకు చివరికి రూ.300 మాత్రమే మిగిలాయని వాపోయింది.

అసలు ఏమైంది?
ఆమె జీతంపై ఏడాది మొత్తం కంపెనీ ముందుగానే ట్యాక్స్ డిడక్షన్ చేసిందన్నారు ప్రియల్ పాల్. అయితే డివిడెండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ వంటి ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చేరడంతో మొత్తం పన్ను పరిధిలోకి వచ్చిన ఆదాయం పెరిగింది. దాంతో అదనంగా సుమారు రూ.24వేలు పన్ను చెల్లించాల్సి వచ్చిందని తెలిపింది. మార్చి 31 తర్వాత పన్ను చెల్లించడం వల్ల మరో రూ.2వేల వరకు వడ్డీ కూడా పడిందని వివరించింది.

నెట్టింట చర్చ
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. "ఏడాదిలో 2 నుంచి 4 నెలలు ప్రభుత్వానికే పనిచేస్తున్నట్లుంది" అని కొందరు కామెంట్స్ పెట్టారు. మరికొందరు జీతం వచ్చినప్పుడు ఆదాయపన్ను, డబ్బు బ్యాంకులో ఉంచితే వడ్డీపై పన్ను, పెట్టుబడులపై పన్ను, ఖర్చు చేస్తే జీఎస్టీ వంటి పరోక్ష పన్నులు కూడా చెల్లించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. దీంతో మధ్యతరగతి ఉద్యోగులపై పన్ను భారం పెరుగుతోందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇటీవల ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సమయంలో ఇలాంటి చర్చలు సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నాయి. ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అందుకు తగిన ప్రభుత్వ సేవలు అందుతున్నాయా అనే ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. ఇదే అంశంపై గతంలో వ్యాపారవేత్త అశ్నీర్ గ్రోవర్ కూడా స్పందిస్తూ.. అధిక పన్ను రేట్లు ఉద్యోగులపై భారంగా మారుతున్నాయని అన్నారు.

నిపుణులు ఏమంటున్నారు?
డివిడెండ్లు, బ్యాంకు వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఏడాది చివర్లో ఒక్కసారిగా భారీ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఈ ఆదాయాన్ని ముందుగానే లెక్కించి అవసరమైతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం, అవసరం అయితే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.