న్యూఢిల్లీ: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించడంపై కోర్టులో సవాలు చేయడానికి టాటా ట్రస్ట్స్ సిద్ధమైంది. గతంలో సైరస్ మిస్త్రీ కేసులో రతన్ టాటా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ వివాదంలో టాటా ట్రస్ట్స్ వైపు నిలిచారు.
వాటాదారుల ప్రాథమిక హక్కులను కాలరాయడం కార్పొరేట్ గవర్నెన్స్‌కు మంచిది కాదని, వందేళ్ల ట్రస్ట్స్–టాటా సన్స్ బంధాన్ని విడదీయడం, వీటో హక్కులను విస్మరించడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డ్ మీటింగ్‌లో చంద్రశేఖరన్ నియామకాన్ని4:1 తేడాతో డైరెక్టర్లు ఆమోదించారు. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఒక్కరే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఎయిరిండియా, టాటా డిజిటల్ పనితీరుపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేయడంతో చంద్ర గతంలో తప్పుకోవాలని భావించినా, బోర్డు ఒత్తిడితో మళ్లీ కొనసాగేందుకు అంగీకరించారు. మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ న్యాయ సలహాను టాటా ట్రస్ట్స్ తీసుకుంటోంది.
