- స్టేషన్లు, కాలనీలు, ఆస్పత్రుల్లో వాటర్ ప్యూరిటీపై పర్యవేక్షణ
హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పరిధిలోని రైల్వే స్టేషన్లు, కాలనీలు, ఆస్పత్రుల్లో సప్లై చేసే తాగునీటి నాణ్యతపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికులు, సిబ్బందికి సురక్షితమైన నీరు అందేలా మెడికల్ విభాగానికి చెందిన సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్ల బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాయి. సరఫరా అయ్యే నీటి నాణ్యతను రసాయన పరీక్షల ద్వారా పరిశీలిస్తున్నారు. ఈనెల 9 నుంచి 15 మధ్య సేకరించిన నమూనాల వివరాలను అధికారులు వెల్లడించారు.
ఈ కాలంలో సేకరించిన 1,722 క్లోరిన్ శాంపిల్స్ అన్నీ అర్హత సాధించగా.. 145 బ్యాక్టీరియాలజికల్, 6 కెమికల్ శాంపిల్స్‌లోనూ అనర్హమైనవి సున్నాగా తేలాయి. ఏడు రోజుల వ్యవధిలో ఏ ఒక్క నీటి నమూనా కూడా నాణ్యతలో ఫెయిల్ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. వాటర్ ప్యూరిటీ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశించారు.
