- టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పట్టణంలో యువతి తాండ్ర అక్షితారాణి మృతి కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితుడిని ఆదివారం గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలోని గోదావరి నది బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన జెట్టి నవీన్ కుమార్.. నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గొడవల కారణంగా కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన తాండ్ర అక్షితారాణి(20) 2022లో నస్పూర్ పాలిటెక్నిక్ కాలేజీలో మైనింగ్ డిప్లొమా కోర్సులో చేరగా, ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 2025లో అక్షిత ఓయూలో ల్యాటరల్ ఎంట్రీ ద్వారా మైనింగ్ ఇంజినీరింగ్ సెకండియర్‌లో చేరింది.
దీంతో నవీన్ కుమార్‌కు, ఆమెకు మధ్య దూరం పెరిగింది. 2026లో గోదావరిఖని జీడీకే 2వ గనిలో అక్షితారాణి అప్రెంటీస్ చేసింది. అక్కడ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. రవికుమార్‌తో సన్నిహితంగా ఉంటుందని అనుమానించిన నవీన్ కుమార్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ముందస్తు ప్లాన్ ప్రకారమే..
ప్లాన్ ప్రకారం నవీన్ కుమార్ తన స్నేహితుడి ఇంటివద్ద గడ్డి మందును వాటర్ బాటిల్‌లో నింపుకున్నాడు. ఈ నెల 12న గోదావరిఖని ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద అక్షితరాణిని తన కారులోకి ఎక్కించుకున్నాడు. రవికుమార్ లైంగికంగా వేధించడం వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నానని అక్షితతో సూసైడ్ లెటర్ రాయించి ఆమె ఫోన్‌లోనే ఫొటోలు తీయించాడు. ఆ తర్వాత గడ్డి మందును బలవంతంగా నోట్లో పోసి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత గోదావరిఖని లెనిన్ నగర్‌లోని ఆమె ఇంటికి తీసుకెళ్లాడు.
అక్షిత తల్లిదండ్రులను కూడా కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్పించి పరారయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13న అక్షిత మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు.
