15 రోజుల్లో డంపింగ్ యార్డు ప్రక్షాళన పనులు ప్రారంభం
కరీంనగర్ టౌన్, వెలుగు: బీజేపీపై కరీంనగర్ ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరాన్ని సందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బల్దియాలో ఇటీవల రూ.47.83 కోట్లతో కొనుగోలు చేసిన 66 ట్రైసైకిళ్లు, 2 ఫాగింగ్ యంత్రాలను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ఆదివారం సంజయ్ ప్రారంభించి పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుధ్య పనులను మరింత మెరుగు పరుస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో 2 డివిజన్లకు ఒక చెత్త ట్రాక్టర్ ఉంటే, ఇటీవల ప్రతి డివిజన్ కు ఒక ట్రాక్టర్ ను అందించినట్లు గుర్తు చేశారు. 15 రోజుల్లో డంపింగ్ యార్డు ప్రక్షాళన పనులు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. టవర్ సర్కిల్లో రూ.25 కోట్లతో ఐదు అంతస్తుల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తామని, దీంతో టవర్ సర్కిల్ ఏరియాలో పార్కింగ్ సమస్యకు తెరపడనుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
