- ఐఎస్ సదన్ పీఎస్ పరిధిలో ఘటన
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాహనం గుర్తింపు
మలక్‌పేట, వెలుగు: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన ఓ ఎక్స్‌యూవీ వాహనం చిన్నారిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. సంతోష్ నగర్ కాలనీకి చెందిన అబ్దుల్ మొయీద్ దంపతులు తమ మూడేండ్ల కుమారుడు మహమ్మద్ ఇజాన్‌తో కలిసి ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న స్వీకార్ హోటల్ సమీపంలోని 'ఫ్యూజన్-6' వద్దకు చాట్ తినేందుకు వచ్చారు.
అనంతరం రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చి వాహనం చిన్నారిని ఢీకొట్టింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాహనం నంబర్‌ను గుర్తించారు. పరారీలో ఉన్న వాహనం, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఐఎస్ సదన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు.
