ఐటీ ఉద్యోగులకు షాక్.. బెంచ్‌ రూల్స్ మార్చేసిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్!

ఐటీ ఉద్యోగులకు షాక్.. బెంచ్‌ రూల్స్ మార్చేసిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్!

AI ప్రభావంతో దేశంలోని టాప్ ఐటీ సర్వీస్ కంపెనీలు తమ ఉద్యోగుల నిర్వహణలో కీలక మార్పులు చేపడుతున్నాయి. ఒకప్పుడు భవిష్యత్ ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో ఉద్యోగులను బెంచ్‌పై ఉంచిన కంపెనీలు.. ఇప్పుడు ఆ విధానానికి గుడ్‌బై చెబుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో, టెక్ మహీంద్రా వంటి సంస్థలు ఏఐ ఆధారిత వర్క్‌ఫోర్స్ ప్లానింగ్, మెరుగైన డిమాండ్ అంచనాలతో బెంచ్ పై ఉండే ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి.

బెంచ్ బలం సగానికి..
ఏఐ రాకకు ముందు ఐటీ కంపెనీల్లో సగటు బెంచ్ స్ట్రెంగ్త్ 20 నుంచి 30 శాతం వరకు ఉండేదని టీమ్‌లీజ్ డిజిటల్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే గత 3 ఏళ్లలో అది లేట్ సింగిల్ డిజిట్ నుంచి గరిష్ఠంగా 12 శాతానికి మాత్రమే పరిమితమైంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది మరింత తగ్గి 8 నుంచి 10 శాతం మధ్యకు చేరే అవకాశం ఉందని అంచనా. అవసరం లేని అదనపు టెక్కీలను బెంచ్ పై ఉంచుకోవటం కంటే.. అవసరమైన నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను మాత్రమే నియమించుకోవడంపైనే ఇండియన్ ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఫోకస్ పెడుతున్నాయి.

బెంచ్ సమయానికీ కోత..
ఉద్యోగులు బెంచ్‌పై ఉండే కాల వ్యవధిలో కూడా భారీ మార్పులు స్టార్ట్ అయ్యాయి. గతంలో ఒక ఉద్యోగి ఏ ప్రాజెక్ట్ లేకపోయినప్పటికీ 45 నుంచి 60 రోజుల వరకు బెంచ్‌లో ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ గడువును ఏకంగా 30 నుంచి 45 రోజులకు కుదించాయి. ఆ సమయంలోనే కొత్త ప్రాజెక్టులో రిక్రూట్మెంట్స్, అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి తిరిగి వినియోగించేందుకు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి.

ALSO READ: చిన్న ఫ్యామిలీలకు గుడ్ న్యూస్..భారత్ గ్యాస్ నుంచి 10 కిలోల సిలిండర్

ఏఐ స్కిల్స్ ఉన్నవారికే అధిక ప్రాధాన్యం..
ప్రస్తుతం ఐటీ సంస్థల్లో రిక్రూట్మెంట్స్ గంపగుత్తుగా కాకుండా సెలెక్టెడ్ స్కిల్ సెట్ ఉన్నోళ్లనే తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకే ప్రాధాన్యం లభిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని త్వరగా ప్రాజెక్టుల్లో పనిచేయగల ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్ల తయారీపై సంస్థలు దృష్టి సారిస్తున్నాయి.

తొలగింపులా? లేక నైపుణ్యాల మార్పా?
బెంచ్ ఉద్యోగుల సంఖ్య తగ్గడం అంటే భారీ స్థాయిలో ఉద్యోగాల కోత అని చెప్పలేమని ఐటీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా ఉద్యోగులకు కొత్త టెక్నాలజీల్లో అప్‌స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్ శిక్షణ ఇచ్చి ఇతర ప్రాజెక్టులకు మార్చే ప్రయత్నం జరుగుతోందట. అయితే ట్రైనింగ్ తర్వాత కూడా సరిపడే అవకాశం లేకపోతే మాత్రమే అదనపు సిబ్బందిని తగ్గించే పరిస్థితి వస్తోంది. అంటే కంపెనీల టార్గెట్ ఉద్యోగుల సంఖ్య తగ్గించడం కాదు, ఏఐ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలున్న వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడమే.

మళ్లీ వేగం అందుకుంటున్న రిక్రూట్మెంట్స్..
మరోవైపు ఐటీ రంగంలో నియామకాలపై ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. విప్రో మినహా చాలా కంపెనీలు మళ్లీ క్యాంపస్ హైరింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. టెక్ మహీంద్రా కూడా గత ఏడాది బ్రేక్ తర్వాత గ్రాడ్యుయేట్ల నియామకాలను తిరిగి చేపట్టనుంది. ఆదాయాలపై స్పష్టత పెరగడంతో పాటు, ఏఐ ఆధారిత సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు సరిపోయే నైపుణ్యాలతో కూడిన ఉద్యోగులను తయారుచేయడమే ఇప్పుడు ఐటీ కంపెనీల ప్రధాన వ్యూహంగా మారింది.