భూ భారతి నయా వర్షన్‌‌‌‌‌‌‌‌.. అక్రమాలకు చెక్‌‌‌‌‌‌‌‌

భూ భారతి నయా వర్షన్‌‌‌‌‌‌‌‌.. అక్రమాలకు చెక్‌‌‌‌‌‌‌‌
  • పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా భారీ  మార్పులు
  • సింగిల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌పైకి సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
  • ప్రత్యేక ఫైర్‌‌‌‌‌‌‌‌వాల్స్‌‌‌‌‌‌‌‌తో పోర్టల్ సెక్యూరిటీ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్.. కఠినంగా లాగిన్ నిబంధనలు
  • డేటా ట్యాంపరింగ్‌‌‌‌‌‌‌‌కు అడ్డుకట్ట
  • ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ను తప్పించి జూనియర్ అసిస్టెంట్లకు  పోర్టల్​ బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూమి లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చేందుకు, గతంలో చోటుచేసుకున్న సాంకేతిక, పరిపాలనా లోపాలను శాశ్వతంగా సరిదిద్దేందుకు భూభారతి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో  మార్పులకు రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది. భూ అక్రమాలకు  కళ్లెం వేస్తూ, ప్రభుత్వ భూములను రక్షించడం, డబుల్ రిజిస్ట్రేషన్లను నివారించడం, లాగిన్‌‌‌‌‌‌‌‌లు ఉన్న అధికారులు తప్ప ఇతరులు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్​లో చొరబడకుండా  కొత్త సంస్కరణలను అమల్లోకి తెస్తున్నది. 

గతంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, చలాన్ల కుంభకోణాలు లాంటి వాటికి తావులేకుండా సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను అత్యంత పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు నిర్వహించే భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొత్తాన్ని ఒకే సింగిల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో ఏ చిన్న తప్పు జరిగినా దానికి సంబంధిత ప్రభుత్వ అధికారులదే పూర్తి బాధ్యత ఉండేలా జవాబుదారీతనాన్ని నిర్దేశిస్తున్నారు.ఈ నూతన వ్యవస్థ ద్వారా సాంకేతిక భద్రతను పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత జవాబుదారీగా మార్చేందుకు అధికారులు విస్తృతస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. 

‘నాలా’ ప్రక్రియలో లొసుగులు.. డేటా అనుసంధాన లోపాలకు చెక్​

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర (ప్లాట్లు, కమర్షియల్) భూమిగా మార్చే ‘నాలా’ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. వ్యవసాయ భూమిని రికార్డుల్లో తక్కువ నాలా రుసుముతో పూర్తి చేసినట్టు చూపిస్తూ, వాస్తవానికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన 3 శాతం నుంచి 5 శాతం నాలా పన్నును ఎగవేస్తున్నారు. కొన్ని చోట్ల అసలు నాలా కన్వర్షన్ అనుమతులు లేకుండానే అక్రమ లే అవుట్లకు, ప్లాట్లకు పోర్టల్‌‌‌‌‌‌‌‌లో నాన్-అగ్రికల్చర్ కోడ్లను కేటాయించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. దీంతో ఒకే సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ను వ్యవసాయ భూమిగాను, ప్లాట్లుగాను విభజించి డబుల్ రిజిస్ట్రేషన్లు చేసే ప్రమాదం ఏర్పడుతోంది. 

ఈ లోపాలను సరిదిద్దేందుకు సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక తనిఖీలను పొందుపరుస్తున్నారు. దీంతో పాటు రెవెన్యూ శాఖ రికార్డులకు, రిజిస్ట్రేషన్ శాఖ రికార్డులకు మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్ల నాలా, నిషేధిత ఆస్తుల జాబితా, మ్యుటేషన్ అప్‌‌‌‌‌‌‌‌డేట్స్  ఆలస్యం జరుగుతోంది. ఫలితంగా సమాచారం లభించక కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. భూమి యాజమాన్య హక్కుల డేటా ట్యాంపరింగ్ లేదా అనధికారిక సవరణలు కాకుండా చూడటానికి, అలాగే నకిలీ ఆస్తుల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిరోధించడానికి బ్లాక్‌‌‌‌‌‌‌‌చైన్ ఆధారిత అత్యున్నత సెక్యూరిటీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.  

సాంకేతిక ఆధారిత అవకతవకలను అరికట్టేందుకు భూభారతి పోర్టల్ సెక్యూరిటీని అత్యున్నత స్థాయికి పెంచుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎదురైన చలాన్ల కుంభకోణాలను దృష్టిలో ఉంచుకొని నిధుల ధ్రువీకరణ ప్రక్రియలో కఠినమైన భద్రతా ప్రమాణాలు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆధారంగా భూముల విస్తీర్ణాన్ని పక్కాగా నిర్ధారిస్తున్నారు. ఆర్‌‌‌‌ఎస్‌‌ఆర్‌‌‌‌లో ఉన్న విస్తీర్ణం  కంటే ఒక్క గుంట భూమి కూడా అదనంగా ఎక్కడానికి వీలు లేకుండా సాఫ్ట్‌‌వేర్‌‌లో కఠినమైన నిబంధనలను పొందుపరిచారు. 

ఇక సర్వర్ లాగిన్స్‌‌ విషయానికొస్తే, కేవలం అధికారిక హోదా ఉన్న తహసీల్దార్‌‌‌‌, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్లకు మాత్రమే నిర్దేశిత లాగిన్ లభ్యమయ్యేలా ప్రత్యేక ఫైర్‌‌వాల్స్‌‌ను సిద్ధం చేశారు. అనధికారిక వ్యక్తులు లేదా థర్డ్ పార్టీ ఆపరేటర్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ సాఫ్ట్‌‌వేర్‌‌లోకి చొరబడకుండా ఈ సాంకేతిక రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు తహసీల్దార్లకు, నాన్-అగ్రికల్చర్ ప్రాపర్టీల బాధ్యతలు సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నప్పటికీ, రెండు వ్యవస్థల మధ్య డేటా అనుసంధానంలో ఉన్న లోపాలను అక్రమార్కులు చాకచక్యంగా వాడుకుంటున్నారు. 

పోర్టల్‌‌ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు చూపించి, అసలు డిజిటల్ సిగ్నేచర్ లేదా క్లియరెన్స్ లేకుండానే బ్యాక్ డోర్ మార్గంలో దస్తావేజులను ఖరారు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల పాత సర్వే నంబర్లకు కొద్దిగా అంకెలు మార్చి, ప్రైవేట్ భూములుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నమోదు చేయించి అక్రమంగా పొందుతున్నట్టు అధికారులు గుర్తించారు. వ్యవస్థలోని ఈ కీలక  లోపాలను పూడ్చేందుకు ప్రస్తుత సంస్కరణల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు.

జూనియర్ అసిస్టెంట్లకు  పోర్టల్​ బాధ్యతలు

భూభారతి నిర్వహణలో సిబ్బంది విధులకు సంబంధించి అత్యంత కీలకమైన మార్పు జరుగుతోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పోర్టల్ లావాదేవీలను చూస్తున్న ప్రైవేట్, ఔట్‌‌సోర్సింగ్ ఆపరేటర్లను రిజిస్ట్రేషన్ ప్రక్రియల నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి స్థానంలో పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులైన జూనియర్ అసిస్టెంట్లకు మాత్రమే భూభారతి రిజిస్ట్రేషన్ల బాధ్యతలను అప్పగించేలా ప్రణాళిక రూపకల్పన చేశారు. 

డేటా నమోదులో ఏవైనా పొరపాట్లు లేదా అక్రమాలు జరిగితే ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవడం చట్టపరంగా ఇబ్బందికరంగా మారుతున్నందున, ప్రభుత్వ ఉద్యోగులనే ప్రత్యక్ష బాధ్యులను చేయడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఔట్‌‌సోర్సింగ్ ఆపరేటర్లకు ఇతర పరిపాలనా సంబంధిత బాధ్యతలను అప్పగించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.  

నూతనంగా బాధ్యతలు స్వీకరించే ప్రభుత్వ ఉద్యోగులకు భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, విరాసత్ లేదా సక్సెషన్ మాడ్యూల్స్ నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, పత్రాల ధ్రువీకరణ విధానం  ఆర్థిక లావాదేవీల నిర్వహణలాంటి అంశాలపై నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. విధులను ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ మాస్టర్ ట్రెయినింగ్ ప్లాన్ రూపొందించారు.