హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను విధుల్లో నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు తర్వాత మొదటి సారి సోమవారం (ఆగస్టు 03) విధుల్లో కనిపించారు. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. కోర్టు తీర్పు తర్వాత వారం రోజుల పాటు వ్యక్తిగత సెలవుల్లో కేరళ వెళ్లారు. సెలవుల తర్వాత విధులకు హాజరయ్యారు.
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారనే కారణంతో రంగనాథ్ ను తొలగించాలని హైకోర్టు జులై 27న చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఓ సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించటం సబబేనా అంటూ ప్రశ్నించింది హైకోర్టు. ఆయన స్థానంలో అర్హత ఉన్న మరో అధికారిని నియమించాలని సూచించింది హైకోర్టు.
లోతుకుంట భూముల వ్యవహారంలో దాఖలైన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. కోర్టులు, న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందంటూ తాను దాఖలు చేసిన అఫిడవిట్ లో స్పష్టం చేశారు రంగనాథ్. లోతుకుంట సర్వే నెంబరు 1,2 లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని.. పిటీషనర్ అవాస్తవాలు చెబుతున్నారని.. కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదని.. న్యాయస్థానాలపై విశ్వాసం, నమ్మకం ఉందని తన అఫిడవిట్ లో స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
రంగనాథ్ దాఖలు చేసిన అఫిడవిట్ పై స్పందించిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయంటూ రంగనాథ్ తరపు లాయర్ ను ప్రశ్నించింది. ఇన్ని కోర్టు ధిక్కార పిటీషన్లపై ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కు తొలగించాలంటూ సీఎస్ ను ఆదేశించింది హైకోర్టు. అతని స్థానంలో అర్హత కలిగిన మరో అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీకి సూచించింది హైకోర్టు.
