ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు.. గాయం తర్వాత నేరుగా భారత జట్టులోకి రీఎంట్రీ!

ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు.. గాయం తర్వాత నేరుగా భారత జట్టులోకి రీఎంట్రీ!

Harshit Rana: టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత దేశవాళీ మ్యాచులు ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ, హర్షిత్ రాణాను నేరుగా అంతర్జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం విశేషం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు అత్యంత నమ్మకస్థుడైన శిష్యుడిగా పేరుండటంతో పాటు, అతనికున్న అసాధారణ బౌలింగ్ నైపుణ్యాల కారణంగానే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్: 
రేపు (జూన్ 20, శనివారం) ఆఫ్ఘనిస్థాన్‌తో చెన్నైలోని ప్రసిద్ధ చెపాక్ (MA Chidambaram) స్టేడియంలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం హర్షిత్ రాణాను బీసీసీఐ రంగంలోకి దించింది. ఇప్పటికే మొదటి రెండు వన్డేల్లో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0 తేడాతో కైవసం చేసుకున్న శుభ్‌మన్ గిల్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ (3–0) చేయాలనే పట్టుదలతో ఉంది.

అదిరిపోయే రీ-ఎంట్రీ: 
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు ముందు సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా కుడి మోకాలి లిగమెంట్ గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్న అతను ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న హర్షిత్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, చెన్నైలో జట్టుతో చేరాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు. ఆఫ్ఘన్‌తో మూడో వన్డేతో పాటు జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20 పర్యటనలకు కూడా హర్షిత్ రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు.

మూడో వన్డేకు భారత జట్టు: 
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా.