రైనీ సీజన్ బ్రేక్ ఫాస్ట్.. అల్లం గారెలు..బర్ఫీ.. ఇవితిన్నారంటే జలుబు చేయదు.. దగ్గురాదు

రైనీ సీజన్ బ్రేక్ ఫాస్ట్.. అల్లం గారెలు..బర్ఫీ.. ఇవితిన్నారంటే  జలుబు చేయదు.. దగ్గురాదు

వర్షాకాలంలో... ఏం తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది? ఏ వంటలు జలుబు, దగ్గు రాకుండా కాపాడతాయి? అని తెలుసుకుని వండుకుంటున్నారు. అయితే ఆరోగ్యం కోసమని చప్పిడి తిండి తినక్కర్లేదు.. ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే నోటికి రుచిగా వండుకోవచ్చు. అలాంటి అల్లం వంటలు మీకోసం..

అల్లం గారెలు తయారీకి కావాల్సినవి

 

  • మినప్పప్పు - రెండు కప్పులు 
  • అల్లం ముద్ద లేదా తరుగు- నాలుగు టీస్పూన్లు 
  • పచ్చిమిర్చి తరుగు - రెండు టీస్పూన్లు
  •  జీలకర్ర-రెండు టీస్పూన్లు
  •  మిరియాలు-అర టీ స్పూన్
  •  ఎండుకొబ్బరి తురుము - ఒక టీస్పూన్ 
  • ఉప్పు - తగినంత
  • నూనె - సరిపడా 
  • లవంగాలు -రెండు
  • దాల్చినచెక్క - చిన్నముక్క

అల్లం గారెలు తయారీ విధానం

మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టాలి. మరోవైపు పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, మిరియాలు, ఎండుకొబ్బరి తురుము, లవంగాలు, దాల్చినచెక్కను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే మినపప్పు, అల్లం తరుగు లేదా పేస్ట్ వేసి మరో రౌండ్ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెల్లా వత్తి మరుగుతున్న నూనెలో వేగించాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటాయి

అల్లం బర్ఫీ  తయారీకి కావాల్సినవి

 

  • అల్లం తురుము - ఒక కప్పు
  • నెయ్యి -ఒక టేబుల్ స్పూన్ 
  • చక్కెర లేదా బెల్లం తరుగు- రెండు కప్పులు
  • పాలు -రెండు కప్పులు 
  • ఇలాచీ పొడి - ఒక టీ స్పూన్
  • ఉప్పు- తగినంత

అల్లం బర్ఫీ  తయారీ విధానం

అల్లం తురుమును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పాన్ లో  నెయ్యి వేడి చేసి అల్లం పేస్ట్ వేయాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత చక్కెర లేదా బెల్లం తరుగు వేసి కలపాలి. మధ్యమధ్యలో కలుపుతూ పావు గంటసేపు ఉడికించాలి. తర్వాత పాలు పోసి మిశ్రమం గట్టిపడేవరకు కలపాలి. ఇలాచీ పొడి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన వెడల్పాటి ప్లేట్ లో వేయాలి. అరగంట తర్వాత చాకుతో బర్ఫీని వచ్చిన ఆకారాల్లో కార్ట్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు 

►ALSO READ | రోజూ పొద్దున్నే కాఫీ తాగుతున్నారా ? అయితే మీ కాలేయానికి ఏమవుతుందో తెలుసా..?