రోజూ పొద్దున్నే కాఫీ తాగుతున్నారా ? అయితే మీ కాలేయానికి ఏమవుతుందో తెలుసా..?

 రోజూ పొద్దున్నే కాఫీ తాగుతున్నారా ? అయితే మీ కాలేయానికి ఏమవుతుందో తెలుసా..?

ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి కాఫీ తాగితే కలిగే హాయే వేరు. చాలామందికి ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ప్రతిరోజు దినచర్యలో భాగం. అయితే, ఇలా రోజూ కాఫీ తాగడం వల్ల మన ఆరోగ్యం ముఖ్యంగా కాలేయానికి (లివర్‌కు) ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్  కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేసారు. ఆయన చెప్పిన ఆ 4 ముఖ్యమైన లాభాలు ఏమిటో  చూద్దామా:

1. లివర్ సిర్రోసిస్ ముప్పు 
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాఫీ చాలా బాగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా కాఫీ తాగేవాళ్లకు లివర్ దెబ్బతినే 'లివర్ సిర్రోసిస్' సమస్య వచ్చే అవకాశం సుమారు 44 శాతం వరకు తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అల్కాహాల్ తాగడం, హెపటైటిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి సమస్యల వల్ల లివర్ కణాలు దెబ్బతిని సిర్రోసిస్ వస్తుంది. కాఫీ దీన్ని నివారించడంలో సహాయపడుతుంది.

2. కాలేయ ఎంజైమ్‌లు 
మన శరీరంలో జీర్ణక్రియలు సక్రమంగా జరగడానికి లివర్ ఎంజైమ్‌లు చాలా ముఖ్యం. రోజూ కాఫీ తాగడం వల్ల లివర్ పనితీరుకు   సూచికలైన ALT, AST అనే ఎంజైమ్ లెవెల్స్ అదుపులో ఉంటాయని, మెరుగ్గా పనిచేస్తాయని డాక్టర్ సేథి తెలిపారు.

3. ఫ్యాటీ లివర్ సమస్య 
ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టయిల్  కారణంగా ప్రతి ముగ్గురు పెద్దల్లో ఒకరు 'ఫ్యాటీ లివర్' (NAFLD) సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించడంలో, లివర్‌ను రక్షించడంలో కాఫీ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యపరంగా బలమైన ఆధారాలు ఉన్నాయి.

4. కెఫిన్ లేని  కాఫీ 
చాలామందికి కెఫిన్ పడదు. అలాగని కాఫీ మానేయాల్సిన పనిలేదు. కాలేయానికి మేలు చేసే గుణాలు కేవలం కెఫిన్‌లో మాత్రమే కాకుండా.. కాఫీ గింజల్లో ఉండే 'పాలిఫెనాల్స్' అనే యాంటీ ఆక్సిడెంట్లలో ఉంటాయి. అందుకే కెఫిన్ తొలగించిన 'డీకాఫ్ కాఫీ' తాగేవాళ్లలో కూడా కాలేయ ఎంజైమ్‌లు మెరుగుపడినట్లు రీసెర్చ్‌లో తేలింది.

మొత్తానికి, ఉదయం పూట మితంగా కాఫీ తాగే అలవాటు మీ లివర్ ఆరోగ్యాన్ని కాపాడటంలో మంచి పాత్ర పోషిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

 

►ALSO READ | జ్యోతిష్యం: రాహువు–కుజుడు గ్రహాల మధ్య నవ పంచమయోగం.. అదృష్టం వరించే నాలుగు రాశులు ఇవే..!