హాలియా, వెలుగు: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజి సమీపంలో హైదరాబాద్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది
. ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కొంకవారిపాలెంకు చెందిన కాకర్ల తోమాసయ్య(59), ఆయన కొడుకు కాకర్ల ప్రకాష్ రావు(35) గురువార రాత్రి హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌లోని సాగర్ మాత ఆలయానికి వెళ్లేందుకు కిరాయి కారులో బయలుదేరారు. రామన్నగూడెం తండా సమీపంలో నాగార్జునసాగర్ నుంచి పెద్దవూర వైపు వస్తున్న మరో కారు రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తోమాసయ్య, ప్రకాష్‌రావు, ఎదురుగా వస్తున్న కారులో ప్రయాణిస్తున్న హనుమకొండ జిల్లా అచ్చంపేటకు చెందిన రావుల సాయికుమార్(24) అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్లు గొర్రె రామకృష్ణ, ఎరకల ప్రవీణ్ తీవ్రంగా గాయపడగా, వారిని కమలా నెహ్రూ హాస్పిటల్‌కు తరలించారు. తోమాసయ్య పెద్ద కొడుకు అంతయ్య ఫిర్యాదు మేరకు పెద్దవూర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, నాగార్జునసాగర్ సీఐ బి.శ్రీను నాయక్, పెద్దవూర ఎస్సై జె.గోపాల్‌రావు, నాగార్జునసాగర్ ఎస్సై సతీష్ సందర్శించారు.
