నిజాయతీ గల ఆలోచనలకు మద్దతు.. ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

నిజాయతీ గల ఆలోచనలకు మద్దతు.. ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు
  •  500 మందికి పైగా హాజరు

హైదరాబాద్, వెలుగు: నిజాయతీతో కూడిన ఆలోచనలకు మద్దతు అందిస్తామని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.  శుక్రవారం జరిగిన హైదరాబాద్ ఎకనామిక్ ఫోరమ్ ​సదస్సులో ఆయన మాట్లాడుతూ, 'సరికొత్త ఆలోచనలతో తెలంగాణకు రండి. ప్రతి ఆలోచన విజయవంతమవుతుందని గ్యారెంటీ  లేకపోవచ్చు, కానీ నిజాయతీతో కూడిన ప్రతి ఆలోచనకు ఇక్కడ మద్దతు, అవకాశం, ఎదిగేందుకు కావాల్సిన నమ్మకం లభిస్తాయని హామీ ఇవ్వగలం' అని చెప్పారు.  

గత పదేళ్లలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌‌లో భారతదేశం 81వ స్థానం నుంచి 39వ స్థానానికి చేరడం, అద్భుతమైన వృద్ధిని సాధించడం ఈ ప్రపంచ మార్పును ప్రతిబింబిస్తోందని తెలిపారు.  ఐకామ్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, స్టార్టప్‌‌‌‌ల కోసం రూ.1,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్,  ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, 100 అడ్వాన్స్‌‌‌‌డ్ ఐటీఐలు వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి వివరించారు.

 ఈ సదస్సుకు ఐదు వందల మందికి పైగా వ్యాపార ప్రముఖులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.