- ట్రైబల్ గురుకుల టీచర్లకు సర్టిఫికెట్లు అందజేత
- ఉన్నత విద్యలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ కావాలని ఆకాంక్ష
హైదరాబాద్, వెలుగు: మాతృభాషను కాపాడుకుంటూనే ఇంగ్లిష్పై పట్టు సాధించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా టీచర్లకు సూచించారు. శుక్రవారం లోక్ భవన్‌లో ఇఫ్లూ ఆధ్వర్యంలో ట్రైబల్ గురుకుల టీచర్ల కోసం జరిగిన ‘రెండు వారాల ఇంగ్లిష్ ప్రావీణ్యత’ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని, ట్రైనింగ్ పూర్తి చేసిన 50 మంది టీచర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ ప్రోగ్రామ్ కోసం గవర్నర్ తన విచక్షణ నిధుల నుంచి రూ.12.80 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇంగ్లిష్‌పై పట్టు పెరగడం వల్ల స్టూడెంట్స్‌లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, గిరిజన విద్యార్థుల జీవితాల్లో మార్పు కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మీటింగ్‌లో ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ నాగరాజు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ పాల్గొన్నారు.
ఉన్నత విద్యలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ కావాలి..
హయ్యర్ ఎడ్యుకేషన్ రంగంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు. లోక్ భవన్‌లో టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో గవర్నర్ సమావేశమై వర్సిటీల పరిస్థితి, కొత్త కోర్సులపై రివ్యూ చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసిన కొత్త కోర్సులను 2026-–27 విద్యా సంవత్సరం నుంచే అన్ని వర్సిటీల్లో అమలు చేయాలన్నారు. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ఏరోస్పేస్, డిఫెన్స్, మారిటైమ్, ఫిన్‌టెక్, క్లైమేట్ గవర్నెన్స్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ టెక్నాలజీ వంటి కొత్త కోర్సులు రూపొందించినట్లు తెలిపారు. గవర్నర్ స్పందిస్తూ.. ఇండస్ట్రీస్, రీసెర్చ్ సెంటర్లతో కోఆర్డినేషన్ చేసుకుంటూ వీటిని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయాలని సూచించారు.
