సింగరేణిలో బొగ్గు మాయంపై దర్యాప్తు చేయాలి..కమీషన్ల కోసం నచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్లు

సింగరేణిలో బొగ్గు మాయంపై దర్యాప్తు చేయాలి..కమీషన్ల కోసం నచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్లు
  • పదేండ్లు సింగరేణిని దోచుకున్న బీఆర్ఎస్​ నేతలపై కేసులు, 
  • విచారణ ఏమైనయ్?బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • సింగరేణి భరోసా యాత్రలో ఉద్రిక్తత

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో 40 లక్షల మెట్రిక్​ టన్నుల బొగ్గు మాయంపై దర్యాప్తు చేయాలని, బొగ్గు అక్రమ రవాణా వెనుక మాఫియా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు. వేల టన్నుల బొగ్గు ఎలా మాయమైందో? కాంగ్రెస్​ సర్కార్​ సమాధానం చెప్పాలని, సింగరేణి ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 

శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియాలోని బొగ్గు గనులపై బీజేపీ ఆధ్వర్యంలో సింగరేణి భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, పైడి రాకేశ్ రెడ్డి, రామారావు పటేల్, ధనపాల్  సూర్యనారాయణ గుప్తా, ఎమెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో సింగరేణిలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు.

 సింగరేణిని బీఆర్ఎస్​ అప్పులకుప్పగా మార్చిందని, అదే తీరులో కాంగ్రెస్​ సర్కార్​ వ్యవహరిస్తోందన్నారు. 40 లక్షల మెట్రిక్​ టన్నుల బొగ్గు మాయం, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై సీబీఐ, హౌజ్​ కమిటీ, అఖిలపక్ష కమిటీతో దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు.

 గత సర్కార్​ కమీషన్ల కోసం నచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్​లు ఇచ్చి అవినీతికి పాల్పడిందన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ ను ఏఎంఆర్​ కంపెనీకి అప్పగించి రూ.20 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. కాగ్​ రిపోర్ట్​లో అక్రమాలు జరిగాయని చెప్పిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని, దీనికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..

-బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం శ్రీరాంపూర్​ ఓసీపీని సందర్శించేందుకు బయలుదేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు వెంకటేశ్వర్లు, కిరణ్​కుమార్​ నేతృత్వంలో పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

గంటన్నర పాటు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యేలను సైతం నెట్టివేయడాన్ని పార్టీ కార్యకర్తలు తప్పుబట్టారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డితో పాటు మరి కొందరిని పోలీసులు వెహికల్స్ లోకి ఎక్కించగా, వాటిని కార్యకర్తలు అడ్డుకున్నారు. పలువురికి స్వల్ప గాయాలవగా, కొందరు ఎండ వేడిమి, తోపులాటతో స్పృహ కోల్పోయారు.