నీతి కథ : దురాశ దుఃఖానికి చేటు.. నక్కకు తగిన శాస్తి.. పులి మనసు మార్చిన స్నేహితులు

 నీతి కథ : దురాశ దుఃఖానికి చేటు.. నక్కకు తగిన శాస్తి.. పులి మనసు మార్చిన స్నేహితులు

ఆ అడవిలో జింక, నక్క ప్రాణ స్నేహితులు. జింకకు నక్క అంటే ప్రాణం. జింక తనతోనే ఎక్కువ సన్నిహితంగా ఉండాలని నక్క అనుకునేది. ఒకరోజు ఒక వేటగాడు చెట్టు చాటున పొంచి ఉండి జింకవైపు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఒక ఎద్దు ఇది గమనించి శరవేగంగా దూసుకెళ్ళి వేటగాడిని బలంగా పొడిచింది. తన ప్రాణాలను కాపాడిన ఎద్దుకు కృతజ్ఞతలు తెలిపింది జింక. అప్పటి నుంచి అవి ప్రాణ స్నేహితులు అయ్యాయి. వారిద్దరి స్నేహం నక్కలో అసూయను పెంచింది. చిన్న విషయానికే ఎద్దుతో గొడవ పడేది. ఎద్దులేని సమయంలో ఎద్దు ప్రవర్తన మంచిది కాదని, అది మిత్రుని రూపంలో ఉన్న శత్రువని, దాని గురించి తనకు తెలుసని చెప్పడం ఆరంభించింది. జింక నక్క మాటలను నమ్మక దూరంగా ఉండటం మొదలుపెట్టింది.

ఒకరోజు నమ్మశక్యంగాని విధంగా.. నక్క, ఎద్దు వద్దకు వచ్చి దాని యోగ క్షేమాలు అడిగింది. “నిన్ను నేను ఎంతో బాధ పెడుతున్నా నువ్వు ఎంతో సహనంతో ఉంటున్నావు. ఆ గుణం నాకు చాలా నచ్చింది. నీవంటి మంచివారిని స్నేహితునిగా పొందడం ఆ జింక అదృష్టం. నన్ను క్షమించి, నన్నూనీ స్నేహితునిగా చేర్చుకో” అంది. సంతోషించిన ఎద్దు ఒప్పుకుంది. నక్క, ఎద్దుతో చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడింది.

“ఇక నేను వెళ్తాను. మళ్లీ సాయంత్రం ఇక్కడే కలుద్దాం" అని వెళ్లిపోయింది నక్క. ఇదంతా వెనకనుండి గమనిస్తున్న జింక ఎద్దు వద్దకు వచ్చి, "మిత్రమా!

ఏనాడూ నీతో సరిగా ప్రవర్తించని ఆ నక్క ఇప్పుడు ఇంత ఆప్యాయంగా ఉంటుందంటే ఇందులో ఏదో కుట్ర దాగి ఉండవచ్చు. జాగ్రత్త" అని చెప్పింది. సరే అంది " నక్క ఏనాటి నుంచో తన స్వార్థం కోసం పులితో స్నేహంగా ఉంటోంది. ఇది జింకకూ తెలియదు. నక్క ఎన్నో జంతువులను మంచి మాటలతో నమ్మించి, మాయా ఉపాయాలతో వాటిని పులికి ఆహారాన్ని చేసేది. అలా చేసినందుకు ఆ ఆహారంలో నక్కకూ వాటా ఉండేది. ఇలా శ్రమ లేకుండా ఆహారాన్ని పొందుతోంది నక్క. ఇప్పుడు ఎద్దును పులికి బలి ఇచ్చి తమ స్నేహానికి అడ్డు తొలగించుకోవాలనుకుంది నక్క. సాయంత్రం వేళ ఎద్దును కలసి దానితో మాట్లాడుతూ అలా అలా తిప్పుతూ పులి వద్దకు చేర్చింది. జింక వీటిని నీడలా అనుసరిస్తోంది. 

పులి ఎద్దుపైకి దూకే సమయానికి పులి, ఎద్దుల మధ్య జింక ప్రత్యక్షం అయ్యింది. నక్క మాయం అయ్యింది. జింక తనను తినమని తన స్నేహితుని వదిలిపెట్టమని పులిని వేడుకుంది. కాదు తననే తినమని ఎద్దు బతిమాలింది. ఇలా చాలా సేపు సాగింది. వీటి రెండిటి స్నేహం పులికి ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. “మీవంటి పుణ్యాత్ములను చంపి పాపం చేయలేను. నా ఆకలి తీరే ఉపాయం ఇక్కడే ఉంది. ఏనాడూ మీకూ, మీలాంటి పుణ్యాత్ములు ఉన్న ఈ అడవికీ హాని చేయను. సుఖంగా జీవించండి" అన్నది పులి. జింక, ఎద్దులు పులికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాయి.

అక్కడికి వచ్చిన నక్క.. పులితో.. "ఏమైంది మిత్రమా! ఎద్దును ఎందుకు వదలిపెట్టావు? ఆ ఎద్దు, జింకలు జిత్తులమారి జీవులు. సమయస్ఫూర్తితో దొంగ నాటకం ఆడి నీ నుంచి తప్పించుకున్నారు. వాటి గుణం నాకు తెలుసు" అంది. అప్పుడు ఆ పులి కోపంతో “అనవసరంగా ఆ పుణ్యాత్ములను నిందిస్తావా?" అంటూ నక్కపై దూకి దానిని బాగా తన్నింది.

 -సరికొండ శ్రీనివాసరాజు