న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే విమానం భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం (ఆగస్ట్ 3) పుకెట్ (థాయిలాండ్) నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI2379 ఎయిర్ ఇండియా విమానం వాతావరణంలో చోటుచేసుకున్న ఆకస్మిక మార్పుల వల్ల గాల్లోనే భారీ కుదుపులకు గురైంది.
దీంతో ఒక్కసారిగా విమానం ఎత్తు తగ్గింది. దాదాపు 300 అడుగులు కిందకు పడిపోయింది. భారీ కుదుపులు, ఆకస్మికంగా ఎత్తు తగ్గడంతో 12 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం విమానాశ్రయంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఊహించని ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ALSO READ : E20 పెట్రోల్ బంద్ చేస్తారా లేదా..
చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులతో పాటు అధికారులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా డీజీసీఏకు సమాచారం అందజేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానాన్ని ప్రత్యేక బేకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తు తర్వాతే ఈ ఘటనకు కారణం ఏంటన్నది తెలుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
